Friday, November 22, 2024

Monsoon | ఢిల్లి, ముంబైలను తాకిన నైరుతి.. జోరువానతో తడిసి ముద్దయిన మహానగరాలు

దేశ రాజధాని ఢిల్లి, ఆర్థిక రాజధాని ముంబై మహానగరాలను నైరుతి ముద్దాడింది. దీంతో జోరువానలతో ఈ రెండు మహానగరాలు తడిసి పోయాయి. ఒకే రోజు తొలకరి ఈ రెండు సిటీలను తొలకరి పలకరించడం చాలా అరుదు. దాదాపు 60 ఏళ్ల క్రితం ఇలా ఒకే రోజు నైరుతి రుతు పవనాలు తాకగా మళ్లి ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. 1961లో జూన్‌ 21న అటు ఢిల్లి, ఇటు ముంబైలకు రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, ఒకేరోజు తొలకరి వర్షాలు కురిసినప్పటికీ.. ఢిల్లికి రెండు రోజులు ఆలస్యంగాను, ముంబైకి రెండువారాల ఆలస్యంగాను ఈసారి రుతుపవనాలు ప్రవేశించాయని వెల్లడించింది.

ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఢిల్లి, హర్యానాలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, జమ్మూలలో విస్తరించాయని భారత వాతావరణ శాఖ డైరక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. మరో రెండు రోజుల్లో మిగతా ప్రాంతాలకు అవి విస్తరిస్తాయని తెలిపారు. జడివాన కారణంగా ఢిల్లి, ముంబై నగరాల్లో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. కొద్దివారాలుగా ఎండలతో మంటెక్కిపోయిన దేశ రాజధాని ఇప్పుడు చల్లబడింది. ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ముంబైలోని అంధేరి, మలాడ్‌, దాహిసార్‌లలో వర్షబీభత్సం ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలోని రాయిగడ్‌, రత్నగిరిలలో ఆరెంజ్‌ అలర్ట్‌, ఫాల్ఘార్‌, ముంబై, ధానే, సింధు దుర్గ్‌ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

విద్యుదాఘాతంతో మహిళ మృతి

- Advertisement -

న్యూఢిల్లిలో వర్షాల కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈస్ట్‌ ఢిల్లిలోని ప్రీత్‌ విహార్‌కు చెందిన సాక్షి అహుజా అనే మహిళ ముగ్గురు చిన్నారులు, మరో ఇద్దరు మహిళలతో కలసి ఆదివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో న్యూఢిల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఎగ్జిట్‌ నెంబర్‌ 1 గేట్‌ వద్ద నీళ్లు నిలిచిపోవడంతో నడిచి వెళ్లడానికి సంచయించింది. ఆమె ఓ కరెంటు స్తంభాన్ని పట్టుకుని వెళ్లబోగా కరెంట్‌ షాక్‌ కొట్టడంతో స్పృహతప్పి పడిపోయింది. ఆమె సోదరి మాధవి చోప్రా, తోటి ప్రయాణికులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే తన సోదరి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిందని మాధవి చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement