Friday, November 22, 2024

IMD | అండమాన్‌ను తాకిన నైరుతి.. వాన‌లు వ‌చ్చేస్తున్నయ్

నైరుతి రుతుపవనాలు ఈరోజు అండమాన్ దీవులను తాకినట్లు IMD వెల్లడించింది. రుతుపవనాలు నికోబార్ దీవులు, మాల్దీవులు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌లోని కొన్ని ప్రాంతాలలో వ్యాపించాయని IMD తెలిపింది. నైరుతి రుతుపవనాలు ప్రతి సంవత్సరం మే 18-20 మధ్య అండమాన్ దీవులను తాకుతాయి. ఈసారి కూడా రుతుపవనాలు అదేవిధంగా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఈ నెల 31న కేరళ తీరాన్ని, జూన్ మొదటి వారంలో రాయలసీమను తాకవచ్చని ఐఎండీ అంచనా వేసింది.

మరో వారం రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఈ నెల 22 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రుతుపవనాల ముందు తొలి అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, 24 నాటికి అది వాయుగుండంగా బలపడుతుందని అంచనా. ఈరోజు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement