నెలాఖరుకల్లా దక్షిణాది అంతటా విస్తరణ
చివరి వారం నుంచే చిటపట చినుకులు
ఈ ఏడాది సాధారణ వర్షపాతమే
రైతన్నలకు వాతావరణ శాఖ స్వీట్ కబురు..
ఉక్కపోత, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈనెల 19 కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది. దీంతో నెలాఖరుకల్లా ఏపీ, తెలంగాణాలలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది… ఈ ఏడాది సాధారణ వర్షపాతమే ఉంటుందని రైతులకు శుభవార్త వినిపించింది..
నాలుగు రోజులూ వర్షాలే…
దక్షిణ కర్ణాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం వడగాలుల ప్రభావం ఉండదని, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేస్తోంది.
ఇదిలా ఉంటే ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీసత్యసాయి, బాపట్ల, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, నంద్యాల, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా బల్లిపల్లిలో 79 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో ప్రజలకు వడగాలుల నుంచి ఉపశమనం లభించింది. సోమవారం ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణలోనూ…
తెలంగాణలోనూ మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో నేడు, రేపు జల్లులు పడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ మే 17వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో మంగళవారం మెరుపులతో కూడిన ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల విషయానికొస్తే, రాబోయే 48 గంటలపాటు ఆకాశం సాధారణంగా మేఘావృతమై తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. వడగాల్పులు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించింది వాతావరణ శాఖ.