హైదరాబాద్, ఆంధ్రప్రభ : నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. ఆదివారం కేరళకు చేరాల్సిన రుతుపవనాలు మరో మూడు నాలుగు రోజులు ఆలస్యం కానున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ ఒకటో తేదీకి రుతుపవనాలు కేరళను తాకుతాయి. అయితే ఈ సారి కాస్త ఆలస్యంగా కేరళకు చేరుతాయని వాతావరణవిభాగం అంచనా వేసింది. జూన్ రెండో వారంలో తెలంగాణను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశముందని అంచనా వేసింది. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా భారత్ వైపు గాలులు అనుకూలంగా ఉన్నందున రుతుపవనాల కదలికకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు పేర్కొంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘవార్తనం పెరుగుతున్నందున వచ్చే మూడు నాలుగు రోజుల్లో రుతుపవనాలు కేరళను చేరుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. అయితే రుతుపవనాల రాక ఆసల్యమైనా ఖరీఫ్ సీజన్‌పై వర్షపాత లోటు ప్రభావం ఉండబోదని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల భారీ వర్షాలు…
పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలకు చెట్లు నేలకొరగడం, కరెంటు స్తంభాలు విరగడం వంటి చెదురు, ముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల వర్షం తీవ్ర విషాదాన్ని కూడా నింపంది. భారీ వర్షానికి పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్ల పిడుగులు పడ్డాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలోని బోగారం, తిమ్మాయిపల్లి, యాదగిరి పల్లి, అంకిరెడ్డిపల్లి, చిర్యాల్, దయరా గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ గాలులకు పలుచోట్ల ఇంటిపై కప్పులు ఎగిరిపోయాయి.
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పరిధిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కోరుట్ల-మెట్పల్లి రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఎల్ఐజీ కాలనీలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి, నాగల్ గిద్ద, మనూరు మండలాల్లో ఈదరుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. వికారాబాద్ జిల్లాలోని కల్కచర్ల మండలం సాల్వీడ్‌లో గొర్రెల మందపై పిడుగుపడింది. ఈ ఘటనలు గడుసు అంజయ్య అనే రైతుకు చెందిన 9 గొర్రెలు, బసమ్మ అనే మహిళకు చెందిన 10 గొర్రెలు మృతిచెందాయి. అదే గ్రామంలో మరోచోట పిడుగ పడగా అంజిలయ్య కు చెందిన 3 గజీవాలు, కృష్ణయ్యకు చెందిన 4 గొర్రెలు మృతిచెందాయి.
ఖమ్మం జిల్లా పరిధిలోని గోపాలపురంలో పెను ప్రమాదం తప్పింది.ఈ దురు గాలులకు ప్రధాని రహదారిపై సెంట్రల్ లైటింగ్ స్తంభం నేలకొరిగింది. ఆ సమయంలో రహదారిపై జన, వాహన సంచారలేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్ నగరంలోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా సాయంత్రంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బంజారాహిల్స్, జూబ్లిdహిల్స్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, లింగంపల్లి, నిజాంపేట, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం ఒక్కసారిగా రావడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. మెట్రో పిల్లర్ల కింద జనం తలదాచుకున్నారు.