Friday, November 22, 2024

దక్షిణ భారత హిట్లర్ కేసీఆర్ : కాంగ్రెస్ నేత మాణిక్యం టాగోర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, కవితపై సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టినా పోలీసులు రంగంలోకి దిగుతున్నారంటే కేసీఆర్, కేటీఆర్, ఎంత పిరికిపందలో అర్థమవుతోందని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం టాగోర్ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దక్షిణ భారత హిట్లర్‌గా మారారని విమర్శించారు. తమ పార్టీ వార్ రూమ్‌లో తెలంగాణ పోలీసులు దౌర్జన్యం చేశారని, ఎలాంటి వారెంట్ లేకుండా కార్యాలయంలోకి వచ్చి హంగామా సృష్టించారని చెప్పుకొచ్చారు. ఒక్క ఫేస్ బుక్ పోస్టును సాకుగా చూపి ఐదుగురిని అరెస్టు చేయడంపై లోక్‌సభలో చర్చ కోరుతూ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టానని మాణిక్యం టాగోర్ వెల్లడించారు. రాష్ట్రంలో ధర్నాలు, ప్రదర్శనలు చేపట్టాలని టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారని తెలిపారు.

అనంతరం ఆయన టీపీసీసీ పదవులపై స్పందించారు. టీపీసీసీ పదవుల కోసం తమ పార్టీలో పోటీ ఎక్కువగా ఉందని, చాలా మంది నేతలు తమకు బాధ్యతలు కావాలని కోరుకుంటున్నారన్నారు. అప్పటికే 84 మందిని ప్రధాన కార్యదర్శులుగా నియమించినప్పటికీ ఇంకా కొందరు నేతలకు పదవులు దక్కలేదని అన్నారు. జాబితాలో లేనంతమాత్రాన వారు సమర్థులు కాదని అనుకోవద్దని స్పష్టం చేశారు. పార్టీలో ఉన్న అందరూ సమర్థులేనన్న ఆయన, అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరారు. అసంతృప్తి ఏదైనా ఉంటే పార్టీలోనే చర్చించాలని, మీడియా ముందుకు వెళ్లకండి అంటూ మాణిక్యం టాగోర్ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. మీడియా ముందుకు వెళ్తే సమస్య పరిష్కారం కాకపోగా మరింత పెరుగుతుందని సూచించారు.

మీడియా ముందుకు వెళ్లి రచ్చ చేయడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని తేల్చి చెప్పారు. తాము ఇంతగా చెప్పినప్పటికీ కొందరు సీనియర్లు మీడియా ముందుకొచ్చారన్న ఆయన, మీడియాలో రచ్చ చేయడం ఒక రోగ లక్షణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు దక్కలేదన్న అసంతృప్తిపై తాము పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటామని, సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement