Tuesday, November 26, 2024

షాకింగ్‌.. హెచ్ఐవీ మ‌హిళ‌లో 216 రోజుల పాటు క‌రోనా

కేప్‌టౌన్‌: ఓ హెచ్ఐవీ సోకిన మ‌హిళ‌లో క‌రోనా వైర‌స్ ఏకంగా 216 రోజుల పాటు ఉంది. ఈ క‌మ్రంలో మొత్తం 32 కొత్త మ్యుటేష‌న్లు ఆమెలో క‌నిపించాయి. ఇందులో చాలా వ‌ర‌కూ ప్ర‌మాద‌క‌ర‌మైన మ్యుటేష‌న్లు ఉన్నాయి. సౌతాఫ్రికాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీనికి సంబంధించిన రిపోర్ట్‌ను మెడిక‌ల్ జ‌ర్న‌ల్ మెడ్ఆర్‌గ్జివ్‌లో ప్ర‌చురించారు. ఈ నివేదిక ప్రకారం 2006లో స‌ద‌రు మ‌హిళ‌కు ఎయిడ్స్ సోకింది. అప్ప‌టి నుంచి ఆమె రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీన‌మ‌వుతూ వ‌చ్చింది. గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో ఆ మహిళ‌కు క‌రోనా వైర‌స్ సోకింది.

అప్ప‌టి నుంచి స్పైక్ ప్రొటీన్‌కు 13 మ్యుటేష‌న్లు క‌లిగాయి. మ‌రో 19 జ‌న్యుప‌ర‌మైన మార్పులు సంభ‌వించిన‌ట్లు గుర్తించారు. ఈ మ్యుటేష‌న్ల‌లో ఈ484కే వంటి ఆందోళ‌న క‌లిగించే వేరియంట్లు కూడా ఉన్నాయి. అయితే ఆ మ‌హిళ ఈ మ్యుటేష‌న్ల‌ను ఇత‌రుల‌కు అంటించిందా లేదా అన్న‌దానిపై స్ప‌ష్ట‌త లేద‌ని రీసెర్చ‌ర్లు చెప్పారు. నిజానికి కొత్త వేరియంట్ల‌లో చాలా వ‌ర‌కూ సౌతాఫ్రికాలోని క్వాజులు నాటాల్ వంటి ప్రాంతాల నుంచి వ‌చ్చిన‌ట్లు వాళ్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఉన్న వ‌యోజ‌నుల్లో ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రు హెచ్ఐవీ పాజిటివ్ కావ‌డం గ‌మ‌నార్హం.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ హెచ్ఐవీ పాజిటివ్ వాళ్ల‌కు క‌రోనా ఎక్కువ‌గా సోకుతుంద‌నిగానీ, వాళ్లపై తీవ్ర ప్ర‌భావం ఉంటుంద‌నిగానీ తేల‌లేద‌ని ప‌రిశోధ‌కులు చెప్పారు. ఇలాంటి మ‌రిన్ని కేసులు బ‌య‌ట‌ప‌డితే మాత్రం.. అడ్వాన్స్‌డ్ హెచ్ఐవీతో ఉన్న‌వాళ్లు కొత్త వేరియంట్ల ఫ్యాక్ట‌రీగా మారే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని వాళ్లు తెలిపారు. త‌క్కువ రోగ‌నిరోధ‌క శ‌క్తి ఉన్న వాళ్లు ఇత‌రుల కంటే ఎక్కువ కాలం క‌రోనా వైర‌స్‌ను క‌లిగి ఉంటార‌ని ఈ అధ్య‌య‌నంలో పాలుపంచుకున్న ప్రొఫెస‌ర్ తులియో డీ ఓలీవీరా వెల్ల‌డించారు. స‌ద‌రు మ‌హిళ గురించి చెబుతూ.. ఆమెకు మొద‌ట్లో స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని, కానీ ఇప్ప‌టికీ ఆమెలో క‌రోనా వైర‌స్ ఉన్న‌ద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. హెచ్ఐవీ పేషెంట్ల విష‌యంలో టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్ మ‌రింత విస్త‌రింప‌జేయాల‌ని తులియో చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement