వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవ్వాల జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మరో విజయాన్ని సాధించింది. అహ్మదాబాద్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇప్పటికే సెమీస్ కు చేరిన సౌతాఫ్రికా ఈ విజయంతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఇక, దక్షిణాఫ్రికా బ్యాటర్లలో వాన్ డెర్ డస్సెన్ 76 (నాటౌట్) పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. క్వింటన్ డికాక్ (41) రాణించాడు. అఫ్గానిస్థాన్ బౌలర్లలలో మహ్మద్ నబీ, రషీద్ ఖాన్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. ముజీబ్ ఉర్ రెహమాన్ ఓ వికెట్ సాధించాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాకు ఇది ఏడో విజయం కావడం విశేషం. ఇక ఈ ఓటమితో ఆఫ్ఘాన్ ఇంటి బాట పట్టింది.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 97 (నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన వారిలో రహ్మాత్ షా 26, రహ్మానుల్లా గుర్భాజ్ 25 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. లుంగి ఎంగిడి, కేశవ్ మహరాజ్ లు చెరో రెండు వికెట్లు తీయగా ఫెహ్లూక్వాయో ఓ వికెట్ సాధించాడు.
ఈ ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ అంచనాలను మించి రాణించింది. మొత్తం 9 మ్యాచులు ఆడి నాలుగు మ్యాచుల్లో గెలుపొందింది. ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లను ఓడించి సెమీస్ రేసులోకి వచ్చింది. అయితే ఆఖరి రెండు మ్యాచులు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిపోవడంతో అఫ్గాన్ సెమీస్ దారులు మూసుకుపోయాయి. ఆఫ్ఘాన్‌కు సెమీస్ అవకాశాలు చేజారినా.. ఈ ప్రపంచకప్‌లో ఒక తీపి గుర్తుగా మిగలనుంది. ఇప్పటి వరకు టి20ల్లో మాత్రమే సంచలనాలు నమోదు చేసిన అఫ్గానిస్తాన్.. తాజా ప్రపంచకప్ తో వన్డేల్లో కూడా అదరగొట్టగలని నిరూపించుకుంది.