ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) చీఫ్ సైంటిస్ట్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డా. సౌమ్య స్వామినాథన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈనెల 30న ఆమె రాజీనామా చేయబోతున్న ఆమె, భారత్‌కి తిరిగి వచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 63 ఏళ్ల సౌమ్య స్వామినాథన్ ఐదేళ్లుగా డబ్ల్యుహెచ్‌ఒలో పనిచేశారు. పదవీ విరమణకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, ముందస్తుగానే చీఫ్ సైంటిస్ట్ బాధ్యతల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నారు. కొన్ని ఆచరణీయ కార్యక్రమాలపై విస్తృతంగా పనిచేయాలని భావిస్తున్నానని, భారత్‌లోనే ఉంటూ తన సేవలను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు.
ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపుతున్న భారత్‌లో, డబ్ల్యుహెచ్‌ఒ కార్యక్రమాలను అమలుచేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో పనిచేయాల్సి వచ్చినప్పటికీ కొంత సమయం మాత్రమే. నా సేవలను భారత్‌లోనే కొనస్తాను అని చెప్పారు. చిన్నపిల్లల వైద్య నిపుణురాలైన సౌమ్య స్వామినాథన్, క్షయ, హెచ్‌ఐవీ పరిశోధనలతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్‌గా రెండేళ్లు సేవలు అందించిన ఆమె, 2017లో డబ్ల్యుహెచ్‌ఒ పదవిలో చేరారు. 2019నుంచి చీఫ్ సైంటిస్టుగా సేవలు అందిస్తున్నారు.