రాష్ట్రంలో నూతన తెలంగాణ అఫర్డబుల్ హౌసింగ్ పాలసీని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో మధ్యతరగతి ప్రజల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు.
కనీసం వంద ఎకరాల్లో ఈ టౌన్‌షిప్‌లను నిర్మించి మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో హిమాచల్ ప్రదేశ్ గృహనిర్మాణ, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఎస్. హెచ్.రాజేష్ ధర్మాని సమావేశమయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ పథకాలపై మంత్రిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వివరించారు.
‘‘హౌసింగ్ నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్న బోర్డు స్థలాల్లో కొత్త గృహాలకు సంబంధించిన పథకాలను అమలు చేయాలని ఆలోచిస్తున్నాం. ప్రైవేట్, ప్రభుత్వ రంగాల భాగస్వామ్యంతో అందుబాటు ధరలో గృహ నిర్మాణ పథకాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొంగులేటి వివరించారు.
ఒకవైపు హౌసింగ్ బోర్డుకు సంబంధించిన భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ని అనుసరించి ఆస్తులు, అప్పుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పధకం ద్వారా నిరుపేదలకు శాశ్వత గృహాలు నిర్మించాలన్న సంకల్పంతో వచ్చే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
రాష్ట్రంలోని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని… రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే తొలిదశలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముగిసిందన్నారు.
వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నాం.. లబ్దిదారులే స్వయంగా ఇళ్లు నిర్మించుకునే సౌలభ్యం కల్పించాం అన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందని వివరించారు. హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు నగరాలు కాగా నాలుగో నగరాన్ని 15 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీగా నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు.