Tuesday, November 26, 2024

Big story | త్వరలో టోల్‌ప్లాజా వ్యవస్థకు చెల్లు.. లేటెస్ట్ టెక్నాల‌జీతో టోల్‌ వసూళ్లు

అమరావతి, ఆంధ్రప్రభ : జాతీయ రహదారుల్లో ఉన్న టోల్‌ప్లాజాలకు త్వరలోనే చెల్లుచీటి పడనుంది. దేశవ్యాప్తంగా కొత్త టోల్‌ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. టోల్‌ప్లాజాల వద్ద రద్దీని పూర్తగా నియంత్రించేందుకు కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టేందుకు సమగ్ర అధ్యయనాన్ని చేస్తోంది. గతంలో టోల్‌ప్లాజాల్లో ఉన్న ప్రత్యక్ష నగదు చెల్లింపులకు ఇప్పటికే స్వస్థి పలికి దాని స్థానంలో ఫాస్టాగ్‌ వ్యవస్థను అందుబాటులోకి కేంద్ర ఉపరితల రవాణా శాఖ తీసుకువచ్చింది. దీంతో టోల్‌ప్లాజాల వద్ద నెలకొన్న రద్దీతో పాటు భారీ క్యూ లైన్లు కొంతమేరకు తగ్గినప్పటికీ పండుగలు, ఇతర ముఖ్య సందర్భాల్లో పరిస్థితి యధావిధిగా మారడంతో కొత్త వ్యవస్థకు అంకురార్పణ చేయాలన్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే ఏడాది కాలం నుంచి దీనిపై అధ్యయనం చేస్తున్న కేంద్రం కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. శాటిలైట్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌ ఆధారంగా ఏఎన్‌పీఆర్‌ కెమెరాలతో ప్రతి వాహనాన్ని ట్రాకింగ్‌, ట్రేసింగ్‌ చేసి టోల్‌ ట్యాక్స్‌ వసూళ్లకు శ్రీకారం చుట్టనుంది.

ప్రతి వాహనానికి జీపీఎస్‌ సిస్టమ్‌ను అమర్చి తద్వారా ప్రయాణించిన దూరానికి ట్యాక్స్‌ వేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఈ విధానంలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లుగా కేంద్ర ప్ర భుత్వం గుర్తించింది. ఈ ఇబ్బందులు, ఇతర సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు అవసరమైన అధ్యయనాన్ని చేస్తోంది. వచ్చే ఏడాది జూన్‌ నుంచి దేశవ్యాప్తంగా విడతల వారీగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. టోల్‌ప్లాజాలను పూర్తిగా ఎత్తివేసి వాహనాలకు కెమెరాలు అమర్చి జాతీయ రహదారుల్లో టోల్‌ ట్యాక్స్‌ వసూళ్లకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రతి వాహనానికి ఏఎన్‌పీఆర్‌ (ఆటోమేటిక్‌ నెంబర్‌ ప్లేట్‌ రికగ్నేషన్‌) విధానాన్ని అమల్లోకి తెచ్చి కెమెరాల సాయంతో టోల్‌ ట్యాక్స్‌ చెల్లించే విధంగా కొత్త విధానాన్ని అమల్లోకి తేనుంది.

- Advertisement -

కొత్త విధానం ఇలా..

ప్రతి జాతీయ రహదారిలో ఏఎన్‌పీఆర్‌ కెమెరాలను పూర్తిస్థాయిలో అమర్చనున్నారు. ఈ కెమెరాల సాయంతో జాతీయ రహదారిలో ప్రయాణించే ప్రతి వాహనానికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తీసుకుంటూ ప్రయాణించిన దూరానికనుగుణంగా ట్యాక్స్‌ను వసూల్‌ చేస్తారు. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని టోల్‌గేట్ల స్థానంలో అమర్చి వాహనదారుల ఫోన్‌ నెంబర్‌కు అనుసంధానం చేసిన బ్యాంక్‌ అకౌంట్ల ద్వారా రుసుము మొత్తాన్ని వసూల్‌ చేస్తారు. వాహనం ఎక్కడైతే ప్రవేశిస్తుందో ఆదే విధంగా ప్రయాణాన్ని జాతీయ రహదారిలో ముగుస్తుందో ఆ దూరం మొత్తాన్ని కెమెరాల సాయంతో లెక్కించి నిర్ధిష్టమైన ట్యాక్స్‌ను వసూల్‌ చేస్తారు. ట్రాకింగ్‌, ట్రేసింగ్‌ ద్వారా ఈ ప్రక్రియ మొత్తం సాగుతోంది. అయితే ఈ విధానంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉండటంతో ఇప్పుడు వాటిని పరిష్కరించే దిశగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ ప్రయత్నాలు చేస్తోంది.

కొత్త విధానంలో 2019 అనంతరం మార్కెట్లోకి వచ్చిన వాహనాల నెంబర్‌ ప్లేట్లను మాత్రమే ఈ కెమెరాలు గుర్తించే పరిస్థితి ఉండటంతో దీనిలో కొన్ని మార్పులు చేస్తోంది. అంతేకాకుండా 9 అంకెలకు మించి ఉన్న రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను కూడా ఈ కెమెరాలు క్యాప్చర్‌ చేయలేని పరిస్థితి స ్పష్టంగా కనిపిస్తుండటంతో ఈ సమస్యలను అధిగమించేందుకు కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించి వచ్చే ఏడాది జూలై నాటికి కొత్త విధానాన్ని అమలు చేసేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. 2024 నాటికి దేశవ్యాప్తంగా పూర్తిగా ఈ కొత్త విధానంలోనే టోల్‌ ట్యాక్స్‌లు వసూల్‌ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

రాష్ట్రంలో 57 టోల్‌ ప్లాజాలు..

ఇదిలా ఉంటె, కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తే ప్రస్తుతం ఉన్న టోల్‌ ప్లాజాలు మూతపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రాష్ట్రంలో జాతీయ రహదారులపై మొత్తం 57 టోల్‌ ప్లాజాలు ఉండగా వీటిలో ప్రస్తుతం ఫాస్టాగ్‌ విధానం అమలవుతోంది. దాదాపు 97 శాతం వాహనాలు ఫాస్టాగ్‌ విధానంలో టోల్‌ ట్యాక్స్‌ను చెల్లిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం తాజాగా అమలు చేయనున్న కొత్త విధానం విడతల వారీగా ప్రవేశపెడుతున్న తరుణంలో 2024 నాటికి ఈ టోల్‌ ప్లాజాలన్ని పూర్తిగా మూతపడనున్నాయి. దీంతో ప్రయాణీకులకు టోల్‌ గేట్ల వద్ద నిరీక్షించాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. ముఖ్యంగా ప్రయాణ సమయం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement