Friday, November 22, 2024

త్వరలో మరో మూడు వందే భారత్‌ రైళ్లు.. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, తిరుపతి, పూనేల మధ్య ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : త్వరలో మరో మూడు వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల సికింద్రాబాద్‌-విశాఖపట్టణం మధ్య ఈ రైలు ప్రారంభం కావడం తెలిసిందే. చైర్‌కార్‌ సదుపాయం ఉన్న ఈ రైలు ప్రారంభమైనప్పటి నుంచి అనూహ్య రీతిలో ప్రయాణికుల ఆదరణ చూరగొంటున్నది. ప్రతీ రోజు వంద శాతం అక్యుపెన్సీతో వందే భారత్‌ పరుగులు తీస్తోంది. ఈ క్రమంలోనే కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్‌-తిరుపతి, సికింద్రాబాద్‌-పూణేల మధ్య త్వరలో మరో మూడు వందే భారత్‌ రైళ్లు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేపట్టింది. రైళ్ల నిర్వహణ కోసం మెకానికల్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధమైంది.

వందే భారత్‌ రైళ్ల కోసం డిపోల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు. కాగా, దక్షిణ మధ్య రైల్వేకు ప్రధాన కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్‌ నుంచి బెంగళూరు, తిరుపతి, పూణే నగరాలకు ప్రయాణికులు ప్రతీ రోజూ వేల సంఖ్యలో వెళుతుంటారు. దీంతో ప్రస్తుతం ఈ మార్గాలలో ఉన్న రైళ్లు సరిపోవడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ మూడు మార్గాలలో వందే భారత్‌ రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ లైన్లలో రద్దీతో పాటు గమ్యస్థానాలకు చేరడానికి ప్రయాణికులకు సుదీర్ఘ కాలం ప్రయాణించాల్సిన దృష్ట్యా వందే భారత్‌ రైళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement