హైదరాబాద్, ఆంధ్రప్రభ: త్వరలోనే పేదల సొంతింటి కల సాకారం కానుంది. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి పెద్దగా ఆర్థిక స్థోమత లేనివారు రాష్ట్రంలో చాలా మంdదే ఉంటారు. ఇలాంటి వారి కోసం 2018 ఎన్నికల సందర్భంగా ఇల్లు లేని పేదలకు సొంత జాగా ఉంటే రూ.5 లక్షలు ఇస్తామని మంత్రి కేటీఆర్ అప్పట్లో ప్రకటించారు. రూ. 5 లక్షలు కాస్త ఆతర్వాత రూ.3 లక్షలైంది. ప్రభుత్వం ఆ రూ.3లక్షలైనా ఇస్తే..దానికి ఇంకొంత అప్పు సప్పు చేసి ఇళ్లు కట్టుకుందామని ఆశావాహులు దాదాపు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారికి ఎదురు చూపులు మినహా ప్రభుత్వం నుంచి మాత్రం ఆర్థిక సహాయం అందడంలేదు. సొంతింటి పథకానికి లబ్ధిదారుల ఎంపిక, మార్గదర్శకాల రూపకల్పన ఏవిధంగా చేయాలనే దానిపై అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గతంలో సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. త్వరతగతిన ఈ మార్గదర్శకాలు పూర్తి చేసి జూన్ నెల చివరికల్లా దీన్ని అందుబాటులోకి తెచ్చి, అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించాలనుకున్నారు.
అయితే లబ్ధిదారుల నిబంధనలు అంశానికి సంబంధించిన ఫైలు సీఎంవోకు ఇప్పటికే చేరినట్లు తెలిసింది. కానీ దానికి ఆమోద ముద్ర పడాల్సి ఉన్నట్లు సమాచారం. దీన్ని సీఎంయే ఫైనల్ చేయాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వేముల ప్రశాంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. పర్యటన ముగించుకొని రేపు రాష్ట్రానికి తిరిగి రానున్నారు. వచ్చిన తర్వాత సంబంధింత అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి, సీఎం కేసీఆర్‌తో ఈ పథకంపై చర్చించనున్నట్లు తెలిసింది. పథకం నిబంధనలు, అబ్ధిదారుల ఎంపిక విషయంలో సీఎం చేసే సూచనలకు అనుగుణంగా చివరిసారిగా ఏమైనా మార్పులు చేర్పులు చేసి ఈ పథకాన్ని అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. దాదాపు ఈనెలలోనే రూ.3 లక్షల సొంతింటి పథకాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఇప్పటి వరకు 17వేల దాకా ఇళ్లను పంపిణీ చేసింది. ఇంకా 1.13 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చివరి దశలో ఉంది. త్వరలో వీటిని కూడా అర్హులైన వారికి పంపిణీ చేయనున్నారు. అయితే సొంత జాగా ఉండి డబుల్ బెడ్ రూమ్‌కు దరఖాస్తు చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారందరికీ రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం భావించింది. ఈక్రమంలోనే ఈ పథకాన్ని అప్పట్లో ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక, నిబంధనలపై సీఎం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ పథకం అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.