Friday, November 22, 2024

రైతుల కోసం త్వరలో ప్లాంట్‌ హెల్త్‌ డాక్టర్‌.. పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రతి మండలంలో ఒక ఆర్‌బీకేలో అమలు

కృష్ణా, ప్రభన్యూస్‌ బ్యూరో ; వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటోంది. వివిధ పంటల సాగులో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవసరమైన ఆధునిక యాజమాన్య పద్ధతులను రైతులకు అందించేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టింది. వారికి పెట్టుబడి సహాయం కింద వైయస్సార్‌ రైతు భరోసా పథకాన్ని అమలుచేస్తోంది. అదే క్రమములో రైతులకు అవసరమైన సేవలను అందుబాటులో ఉంచేందుకు రైతు భరోసా కేంద్రాలను(ఆర్‌బీకే) ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులు పండించిన పంటలు కూడా ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేస్తోంది. తాజాగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో వైయస్సార్‌ గ్రామీణ హెల్త్‌ క్లినిక్‌ ల ద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అమలు చేస్తోంది.

అదే పద్ధతిలో వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, అధిక దిగుబడులు సాధించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు వారి ముంగిట అందించేందుకు ప్లాంట్‌ హెల్త్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా వివిధ పంటలకు సోకే తెగుళ్లు, తక్షణమే వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడానికి పాటించాల్సిన మెలకువలు, ఆధునిక యాజమాన్య పద్ధతులపై క్షేత్రస్థాయిలో రైతులకు త్వరలో సేవలు అందనున్నాయి. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. ప్లాంట్‌ హెల్త్‌ డాక్టర్‌ కు సంబంధించి విధి విధానాలను రూపకల్పన చేస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణకు జిల్లా స్థాయి రిసోర్స్‌ కేంద్రాన్ని (డిఆర్‌సి) ఏర్పాటు చేశారు. డిఆర్‌సి కి ఇన్చార్జిగా వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్లను నియమించారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద తొలుత మండలంలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని (ఆర్‌బీకే) ఎంపిక చేశారు. ఈ ఆర్‌బికె కేంద్రంలో పనిచేయుచున్న వ్యవసాయ సహాయకుడికి మూడు వారాలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి జిల్లాలోని వ్యవసాయ శిక్షణ కేంద్రంలో గాని, వ్యవసాయ పరిశోధన కేంద్రంలో గాని ఎంపిక చేసిన వ్యవసాయ సహాయకులకు శిక్షణ ఇస్తారు. ప్లాంట్‌ హెల్త్‌ డాక్టర్‌ కు సంబంధించి వ్యవసాయ శాస్త్రజ్ఞులు ఎంపిక చేసిన వ్యవసాయ సహాయకులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. వివిధ పంటలకు వ్యాపించే చీడపీడలు, తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. అలాగే సాగు యాజమాన్య పద్ధతులు, ఎరువులు వినియోగం, సేంద్రియ ఎరువుల ఆవశ్యకత, ఆధునిక యంత్రాల వినియోగం తదితరు అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తాను. ప్రతి మండలంలో అన్ని వసతులు కూడిన ఆర్పీకే కేంద్రాన్ని ఎంపిక చేస్తారు.

- Advertisement -

ప్రతి మండలం నుంచి ఒక వ్యవసాయ సహాయకుని ఎంపిక చేస్తారు. ఈ ఎంపికలో ఏజీబీఎస్సీ, హార్టికల్చర్‌ బీఎస్సీ ఉన్న వ్యవసాయ సహాయకులకు ప్రాధాన్యత ఇస్తారు. బిఎస్సి అభ్యర్థుల లభించిన పక్షంలో డిప్లమో కలిగి, చురుకుగా పనిచేసే వారిని ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి మూడు వారాలపాటు ప్లాంట్‌ హెల్త్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ఆర్‌.బి.కెలలో విజయవంతం అయితే అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్లాంట్‌ హెల్త్‌ డాక్టర్‌ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

మే 2 నుంచి శిక్షణ..

ప్లాంట్‌ హెల్త్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌కు ఎంపి-కై-న వ్యవసాయ సహాయకులకు మే మూడో తేదీ నుంచి ఉయ్యూరు వ్యవసాయ పరిశోధన పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తారు. ప్రతి మండలంలో ఒక ఆర్‌బీకేని గుర్తించాం. బీఎస్సీ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యత ఇచ్చాం., ఈ కార్యక్రమం అమలుపై వీరికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. రైతులకు మేలైన యాజమాన్య పద్ధతులు, తెగుళ్లు, పురుగులు సోకినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తారు. అనంతరం వీరు రైతులకు అందుబాటు-లో ఉండి , వారికి అవసరమైన సేవలు అందిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement