జన్నారం, (ప్రభన్యూ స్) : పెళ్లి చేసుకున్న పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా రూ.1 లక్షతో పాటు తులం బంగారం త్వరలో ఇస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆ పథకం పేద కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో దోహద పడుతుందన్నారు.ఈ పథకం వల్ల అనేక మందికి లబ్ది చేకూరుతుందని,రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమ కోసం పెద్దపీట వేస్తోందన్నారు.
మండలంలోని తపాల్ పూర్, రోటిగూడ, చింతగూడెం, తిమ్మాపూర్, రాంపూర్ గ్రామంలో ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను, పంటలను ఆయన పరిశీలించారు.వివిధకారణాలతో మండలంలోని ఆయా గ్రామాలలో ఇటీవల చనిపోయిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.
అనంతరం మండలంలోని కిష్టాపూర్ లో గతంలో ఆ గ్రామానికి చెందిన స్వామి, ఎమ్మెల్యే గెలిచాక వినాయకుని వద్ద 101 టెంకాయలను కొడతామని మొక్కుకోవడంతో ఎమ్మెల్యే నూట ఒక్క టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి, ఎంపీడీఓ ఠాగూర్ శశికళ, ఎస్సై రాజవర్ధన్,ఎంపీఓ జలంధర్, ఎమ్మారై భానుచందర్, కాంగ్రెస్ పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.