హైదరాబాద్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వు (ఏటిఆర్ ) ఫారెస్ట్ ప్రాంతంలో వైల్డ్ లైఫ్ టూరిజం వారం పది రోజుల్లనే అందుబాటులోకి రానుంది. ఇందులో పర్యాటకుల కోసం ఫారెస్టు స్టడీ టూర్‌తో పాటు అటవీ ప్రాంతంలో టైగర్ సఫారీ, అలాగే కొండలు, గుట్టల్లో ట్రెక్కింగ్‌తో పాటు ఆదివాసీ గిరిజన బిడ్డలతో మాట్లాడే అవకాశం తదితర అరుదైన అనుభవాలను టూరిష్టులకు కల్పించనున్నారు.
అత్యంత దట్టమైన అటవీ ప్రాంతాల్లో అది కూడా ప్రకృతి ఒడిలో గడుపుతూ అటవీ అందాలను వీక్షించేలా ఏర్పాటు చేయిస్తున్నారు. తెలంగాణలో పెద్ద పులకు ఈ అడవి పెట్టింది పేరు. చెప్పాలంటే అమ్రాబాద్ టైగర్ రిజర్వు లో ఈ యాత్ర ఈ వారం పది రోజుల్లోనే ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం . ఏటిఆర్‌లోని ఫరహాబాద్‌లో ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ టైగర్ సఫారీకి సంబంధించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ డాట్ కామ్ వెబ్ సైట్‌లో బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. చాలా మంది శ్రీశైలం దేవస్థానానికి వెళ్తూ ఇక్కడి అడవిలో కొద్ది సేపు ఆగి అక్కడి ఆహ్లాదాన్ని పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు.
ఆ తరహా పర్యాటకులు కాకుండా అడవికి సంబంధించిన ప్రత్యక్ష అనుభూతి పర్యాటకులకు లభించాలనే ఉద్దేశంతో పాటు ప్రకృతి అందాలు, అడవి ప్రత్యేకతలు అందరికీ తెలిఇసేలా చేయాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ వైల్డ్ లైఫ్ టూరిజం అందుబాటులోకి తెస్తున్నారు. కాగా టైగర్ సఫారీకి గాను ఎనిమిది కొత్త వాహనాలను సిద్ధం చేస్తున్నారు. టైగర్ సఫారీకి అనువుగా ఈ ఎనిమిది కొత్త వాహనాల్లో విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది టైగర్ సఫారీని మొదలు పెట్టినప్పుడు 8 సందర్భాల్లో సందర్శకులకు ఏడెనిమిది పులులు కనిపించాయని చెబుతున్నారు. ఈ ఏడాది మరిన్ని పులులు కనిపించే అవకాశం ఉంటుందన్నారు. అలా ఈ ఏడాది సఫారీ ఏరియాలో కాకుండా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో పులులను చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.