పర్యావరణ పరిరక్షణకు భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమను ప్రోత్సహిస్తోంది. ఇక త్వరలోనే వాహన ఇంధన వినియోగం తగ్గేలా ‘ఎలక్ట్రిక్ కేబుల్ హైవే’లను ప్రవేశపెట్టనుంది. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం, గమ్యస్థానాల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుంది. కాగా, ఈ టెక్నాలజీ ఇప్పటికే జర్మనీలో 2019లోనే అందుబాటులోకి వచ్చింది.
త్వరలో జైపూర్-ఢిల్లీ మార్గంలో
ఇక మన దేశంలో కూడా జైపూర్-ఢిల్లీ మార్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఎలక్ట్రిక్ కేబుల్ హైవేలను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. తాజాగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎలక్ట్రిక్ కేబుల్ హైవే ప్రాజెక్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దీనిపై ప్రణాళికలు సిద్ధమయ్యామని, త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉందని గడ్కరీ తెలిపారు. ఎలక్ట్రిక్ కేబుల్ ద్వారా హైవేపై వెళ్తున్న వాహనాలకు విద్యుత్ శక్తిని అందించి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు.