హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. ముందుగా దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లి, బెంగళూరు, కలకత్తా, హైదరాబాద్‌లో ప్రారంభమైన రైళ్లు ప్రస్తుతం అన్ని నగరాలకు విస్తరిస్తున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 35 కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ సిద్ధమైంది. తాజాగా, మరో 4 కొత్త రైళ్లు పరుగులు తీసేందుకు సిద్ధమయ్యాయి. ఈనెల చివరి వారంలో వీటిని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నాలుగు రైళ్లు కూడా ప్రారంభమైతే దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య మొత్తం 29కి చేరనుంది.
కాగా, కొత్త వందే భారత్ రైళ్లకు కొత్త రంగులు వేయడంతో సరికొత్త రంగులు వేయడంతో సరికొత్త లుక్‌ను సంతరించుకున్నాయి. ఈ నాలుగు రైళ్లు కూడా ఎనిమిది కోచ్‌లతో నడవనున్నాయి. ఇందులో ఏడు చైర్ కార్లు, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఈ కొత్త రైళ్లు దిల్లి-చండీగఢ్, చెన్నై-తిరునల్వేలి, లఖ్‌నవూ-ప్రయాగ్‌రాజ్, గ్వాలియర్-భోపాల్ రూట్లలో కొత్త వందే భారత్ రైళ్లు నడవనున్నాయి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో విశాఖ-సికింద్రాబాద్, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే, కొత్తగా ప్రారంభించనున్న వందే భారత్ రైళ్లలో చెన్నై-తిరునల్వేలి దక్షిణాది రాష్ట్రాలలోని ప్రధాన స్టేషన్లను కలుపుతూ నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు త్వరలో చెన్నై-తిరుపతి, చెన్నై-విజయవాడ మధ్య కూడా కొత్తగా రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు వీటికి సంబంధించిన సర్వే పనులు కూడా పూర్తయ్యాయని సమాచారం. ముందుగా ట్రయల్ రన్ నిర్వహించిన తరువాత ఈ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉంది.