Tuesday, November 26, 2024

Followup: రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి కోసం సోనియా ప్రయత్నాలు.. మిత్రపక్షాలతో మంత‌నాలు

రాష్ట్రపతి ఎన్నికలకు నగారా మోగడంతో, కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రథమ భారతీయుడు ఎన్నిక కోసం ప్రయత్నాలు చేపట్టాయి. రాష్ట్రపతి అభ్యర్థిని సొంతంగా గెలిపించే మెజార్టీ లేని ఎన్డీఏ ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించగా, ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి, గెలిపించేందుకు యూపీఏ కన్వీనర్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రంగంలో దిగారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్రపతి ఎన్నికల ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మిత్రపక్ష పార్టీల నేతలకు ఫోన్‌లు చేశారు. సీపీఎం జనరల్‌ సెక్రటరీ సీతారాం ఏచూరి, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మరియు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీలకు సోనియా గాంధీ ఫోన్‌లు చేశారు. ఎన్డీఏ నిలబెట్టనున్న రాష్ట్రపతి అభ్యర్థిపై, పోటీగా ఉమ్మడి అభ్యర్థిని పోటీలో దింపే అంశంపై ఆమె వారితో చర్చించారు. సోనియాగాంధీ కొవిడ్‌తో బాధ పడుతున్న కారణంగా ఆ బాధ్యతను రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లిఖార్జున్‌ఖర్గేకు అప్పగించారు. కాంగ్రెస్‌పార్టీతో కలిసి వచ్చే పార్టీలతో చర్చించాల్సిందిగా సూచించారు.

దీంతో, రంగంలోకి దిగిన మల్లిఖార్జున్‌ఖర్గే ముంబైలో శరద్‌పవార్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీఎంకె, టీఎంసీ పార్టీల అధ్యక్షులతో సమావేశమయ్యేందుకు ఒక తేదీని నిర్ణయించనున్నట్లు ప్రకటించారు. పలు పార్టీలతో కలిసి సమావేశం నిర్వహించి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీకి తగిలిన వరుస ఓటముల కారణంగా కాంగ్రెస్‌ రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ప్రాంతీయ పార్టీల కంటే దయనీయమైన స్థితిలో ఉంది. దీంతో, ఉమ్మడి అభ్యర్థిత్వంపై ప్రతిపక్ష పార్టీల నేతలతో చర్చించాల్సిందిగా, సోనియాగాంధీ రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లిఖార్జున్‌ ఖర్గేకు సూచించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే అంశంపై వారితో చర్చించాలని ఆమె కోరారు.

రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎన్డీఏయేతర, యూపీఏయేతర పార్టీలతో మాట్లాడాల్సిందిగా, సోనియా గాంధీ పార్టీ నేత మల్లిఖార్జున్‌ఖర్గేకు సూచించారని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు శుక్రవారం న్యూఢిల్లిdలో వెల్లడించారు. ఖర్గే ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమై ఆమోదయోగ్యమైన అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తారని వెల్లడించారు. అయితే, యాంటీ బీజేపీ వర్గం చూపు ప్రధానంగా ప్రాంతీయపార్టీలు వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్‌, బీజేడీలపై ఉంది. కానీ, వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలతో కాంగ్రెస్‌ నేత ఖర్గే సంప్రదింపులపై ఇంకా స్పష్టత లేదు. యాంటీ బీజేపీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. నాన్‌ కాంగ్రెస్‌పార్టీలు సైతం రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో తమతో కలిసి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జులై 24వ తేదీతో పూర్తి కానుంది. దీంతో, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను అదే నెల 21న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో 4,809 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో రాజ్యసభ ఎంపీలు 233 మంది, లోక్‌సభ ఎంపీలు 543 మంది, ఎమ్మెల్యేలు 4,033 మంది ఉన్నారు.అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో విప్‌ జారీ చేసేందుకు ఏ రాజకీయ పార్టీకి అధికారం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీగంతో, ప్రజాప్రతినిధులు ఆత్మప్రభోదం ప్రకారమైనా, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకైనా ఓటేయవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement