Tuesday, November 26, 2024

వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసంపై ప్రధాని మోదీకి సోనియా లేఖ

సీరమ్ వ్యాక్సిన్ ధరలపై సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి ఒక్కో రేటు నిర్ణయించడాన్ని తప్పుబట్టారు. కేంద్రానికి 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వానికి 400 రూపాయలు, ప్రయివేట్ ఆస్పత్రులకు 600 రూపాయలు ధర నిర్ణయించడమేమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే కంపెనీ తయారు చేసే వ్యాక్సిన్‌పై ఇన్ని రకాల ధరలు ఎందుకని ప్రశ్నించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సీరమ్ నిర్ణయించిన ధరలతో సామాన్య పౌరులపైనా, రాష్ట్ర ప్రభుత్వాలపైనా భారం పడుతుందని, 18 నుంచి 45 ఏళ్ల వయసున్న వారందరికీ వ్యాక్సిన్ అందించే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని కోరారు.

ఆస్పత్రుల్లో తీవ్రంగా ఆక్సిజన్ కొరత, పడకల కొరత వేధిస్తోందని ఇలాంటి సమయాల్లో వ్యాక్సిన్ అమ్మకంతో ప్రజలపై భారం మోపడం సరైన నిర్ణయం కాదని హితవు పలికారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ కొనే పరిస్థితిలో సామాన్యుడు లేదని చెప్పారు. ఆర్థిక అసమానతలతో సంబంధం లేకుండా అందరికీ వ్యాక్సిన్ అందించే బాధ్యతను కేంద్రం తీసుకోవాలని సోనియా విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement