ఆమెతో పాటు మరో 11మంది కూడా
ప్రమాణం స్వీకారం చేసిన వారిలో రైల్వేమంత్రి
అశ్విని వైష్ణవ్, వైసిపి సభ్యులు వై వి సుబ్బారెడ్డి
మేడా రఘునాద్, గొల్ల బాబురావులు
రాజ్యసభలో నాలుగో పెద్ద పార్టీగా వైసీపీ
న్యూ ఢిల్లీ – ఇన్నాళ్లూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ సారి లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్న ఆమె తొలిసారిగా పెద్దల సభకు ప్రాతినిథ్యం వహించబోతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఇవాళ ఉదయం సోనియాతో రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
మన్మోహన్ ప్లేస్ లో సోనియా…
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సోనియా పోటీ చేశారు. నిన్నటితో మన్మోహన్ పదవీకాలం ముగిసింది. రాజస్థాన్ నుంచి సోనియా పెద్దల సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఇవాళ ఉదయం సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. సోనియాతో పాటు రాజ్యసభకు ఎన్నికైన 12మంది ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఉన్నారు. ఆయన ఒడిశా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
వైసీపీ సభ్యులు ముగ్గురు కూడా…
కొత్తగా ఎన్నికైన వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డిలతో కూడా జగ్దీప్ ధన్కడ్ ప్రమాణం చేయించారు. వారిలో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి ఇంగ్లీష్ లో ప్రమాణం చేయగా… గొల్ల బాబూరావు హిందీలో ప్రమాణం చేశారు. కొత్త సభ్యులతో కలిపి ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో నాలుగో పెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. 97మంది రాజ్యసభ సభ్యులతో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా… 29 మంది సభ్యులతో కాంగ్రెస్, 13 మంది సభ్యులతో టీఎంసీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.