న్యూఢిల్లీ – మొత్తం 141 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ పెదవి విప్పారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఊపిరి ఆడకుండా చేస్తోందని విమర్శించారు. మునుపెన్నడూ పార్లమెంట్ నుంచి ఈ స్థాయిలో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయలేదని అన్నారు.
అది కూడా సహేతుకమైన, చట్టబద్ధమైన డిమాండ్‌ను లేవనెత్తినందుకు వేటు వేశారని దుయ్యబట్టారు. పార్లమెంటులో సభ్యుల సస్పెన్షన్లను ఉద్దేశించి బుధవారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, డిసెంబర్ 13న పార్లమెంటులో జరిగిన అలజడి సంఘటన క్షమించరానిదని సోనియా గాంధీ అన్నారు. దీన్ని ఎవరూ సమర్థించలేరని తెలిపారు. అయితే, దీనిపై స్పందించడానికి ప్రధానమంత్రి మోడీకి నాలుగు రోజుల సమయం పట్టిందని విమర్శించారు.
అది కూడా ఇంత గంభీరమైన విషయంపై ఆయన తన అభిప్రాయాలను పార్లమెంటు వెలుపల వ్యక్తం చేశారని తెలిపారు. ఇది సభను అపహాస్యం చేయడమేనని విరుచుకుపడ్డారు. దేశ ప్రజల పట్ల ఆయన నిర్లక్ష్యపూరిత వైఖరికి ఇది నిదర్శమని విమర్శించారు. పార్లమెంట్ దాడిపై పార్లమెంట్ బయట సమాధానం చెప్పడం పార్లమెంట్ వ్యవస్థ పట్ల మోడీకి ఉన్న వైఖరి ఏమిటో అర్ధమవుతుందని అన్నారు.