Thursday, November 21, 2024

Delhi: బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ పై సోనియా ఆగ్ర‌హం

ఆర్థిక మూలాలు ధ్వంసం చేస్తారా?
పోటీని అడ్డుకునేందుకే మా పార్టీని నిర్వీర్యం చేస్తున్నారు
కనీసం పోస్టర్లు ముద్రించలేని స్థితి
ఇదీ పూర్తిగా అప్రజాస్వామికం
మోదీకి కాంగ్రెస్సే టార్గెట్
డెమోక్రసీకి ప్రమాదం
ప్రజలు ఇచ్చిన విరాళాలను
అడ్డుకోవటం అన్యాయం
కాంగ్రెస్ అగ్రనేతల ఆక్రోశం

( ఆంధ్రప్రభ స్మార్ట్, దిల్లీ ప్రతినిధి)
ఎలక్టోరల్ బాండ్లను ఫ్రీజ్ చేయటమంటే… తమ పార్టీ ఆర్థిక మూలాలను ధ్వంసం చేయటమేనని, ఎన్నికల్లో పోటీ చేయకుండా తమ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గోడలపై పోస్టర్లను అంటించేందుకు అవకాశం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్‌ చేయడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు.. ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందన్నారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ చేయడంపై సోనియా గాంధీ తొలిసారి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తమ పార్టీకే కాదని మొత్తం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమన్నారు. ప్రజలు పార్టీ కోసం ఇచ్చిన విరాళాల వినియోగాన్ని అడ్డుకోవటం అప్రజాస్వామికమన్నారు.

కాంగ్రెస్సే మోదీ టార్గెట్

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిందని ఆరోపించారు. అధికార పార్టీ వైఖరి ఎంతో ప్రమాదకరమన్నారు. బీజేపీ వేల కోట్ల రూపాయిలు విరాళాలుగా తీసుకుని.. కేవలం మా బ్యాంకు ఖాతాలను ఎందుకు స్తంభింపజేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలు, ఆదర్శాలకు భారత్ పేర్గాంచిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన విషయం ప్రజలకు తెలిసిందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నిష్పక్షపాతమైన ఎన్నికలు తప్పనిసరన్నారు. ప్రతి ఒక్కరికీ సమానమైన అవకాశాలుండాలని ఖర్గే పేర్కొన్నారు. మోదీ పాలనలో భారతదేశ ప్రతిష్ట దిగజారుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను సీజ్ చేయడం ద్వారా ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఓ రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డంకులు సృష్టించడం సరికాదని.. ఖర్గే అభిప్రాయపడ్డారు. ఎక్కడ చూసినా బీజేపీ ప్రకటనలే కనిపిస్తున్నాయి. తమ బ్యాంకు ఖాతాలు స్తంభిపజేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.

కనీసం పోస్టర్లకు డబ్బుల్లేవు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తాము ప్రచారం చేసుకోలేకపోతున్నామన్నారు. పోస్టర్లు వేయించడానికి వీలులేని పరిస్థితులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కల్పిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ప్రజలకు తమకు మద్దతు ఇవ్వాలని అజయ్ మాకెన్ కోరారు. బీజేపీతో సహా ఏ రాజకీయ పార్టీ ఆదాయపు పన్ను చెల్లించనప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 బ్యాంకు ఖాతాలను ఎందుకు ఫ్రీజ్ చేశారని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

ముమ్మాటికీ బీజేపీ కుట్రే

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యమే లేదన్నారు. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేస్తే ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలమన్నారు. ఎవరిదైనా బ్యాక్ అకౌంట్ మూసివేసినా, ఏటీఎం కార్డు పని చేయకుండా చేస్తే జీవించగలరా.. ప్రస్తుతం తాము ఎన్నికల్లో ప్రచారం చేసే పరిస్థితి లేకుండా బీజేపీ కుట్రకు పాల్పడిందన్నారు. ఎన్నికలకు 2 నెలల ముందు ఇలా చేయడం వల్ల కాంగ్రెస్‌ను ఎన్నికల్లో పోటీ చేయనివ్వకూడదనేదే బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోందని రాహుల్ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement