Friday, November 22, 2024

Chennai: 1995లో అత్త‌ను హ‌త్య చేసిన అల్లుడు – 28 ఏళ్ల త‌ర్వాత చిక్కిన నిందితుడు

చెన్నై – హత్య చేసి పారిపోతే.. దొరకకుండా ఎక్కడకూ పోరు. పోలీసులు వెంటాడి వేటాడి మరీ బొక్కలో వేస్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం పోలీసుల కళ్లుగప్పి 28 ఏళ్ల నుంచి తప్పించుకుతిరుగుతున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే ఎట్టకేలకు చివరకు ఆ నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు. ఈ అరుదైన ఘటన తమిళనాడులో జరిగింది.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నిందితుడు పోలీసులు కన్నుగప్పి ఒడిశా రాష్ట్రంలో జీవితం కొనసాగిస్తుండటం విశేషంగానే చెప్పుకోవాలి. 1994లో చెన్నైలోని ఓ అడ్వర్టైజింగ్‌ కంపెనీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తున్న పట్టాజోషి అనే వ్యక్తి మరో కంపెనీలో టెలిమార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఇందిర (21)తో ప్రేమలో పడ్డాడు. జూలై 1994లో వివాహం చేసుకున్నారు. అయితే, వివాహమైన కొన్ని నెలల తర్వాత వారి కాపురంలో పొరపొచ్చాలు వచ్చాయి. దీంతో ఇద్దరూ విడివిడిగా ఉండడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇందిర విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.

దీంతో కోపోధ్రిక్తుడైన హరిహర పట్టజోషి భార్య ఇందిర, అత్త రమా(48), బామ్మర్ది కార్తిక్‌లపై 1995 ఆగస్టు 9న కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ రమా అదేరోజు మృతి చెందింది. భార్య, బావ తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఆదంబాక్కం పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. అయితే నిందితుడు పట్టజోషి ఆ తర్వాత చెన్నై పారిపోయాడు. 1995 నుండి, పట్టజోషి ఒడిశా, సూరత్‌లో వివిధ ప్రదేశాలలో ఉన్నాడు. తొలినాళ్లలో అతను అస్కాలోని ఒక స్నేహితుని ఇంట్లో దాక్కున్నాడు. అక్కడ అతను మరొక మహిళను 2001లో వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె సంతానం. తర్వాత బెర్హంపూర్‌లోని సుగంధ ద్రవ్యాల ఫ్యాక్టరీలో, తర్వాత కేంద్రపరాలోని బజాజ్ బీమా కంపెనీలో సేల్స్‌మెన్‌గా, బెర్హంపూర్‌లోని చిట్ ఫండ్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేశాడు.

గత 28 సంవత్సరాలలో, బెర్హంపూర్ సమీపంలోని ప్రదేశాలలో అనేక పోలీసు బృందాలు దాడులు నిర్వహించాయి. అయితే నిందితుడు తరచూ ఇల్లు, ఉద్యోగం మారుతున్నందున అతన్ని పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. వారం రోజుల క్రితం చెన్నైలోని ఆదంబాక్కం పోలీస్ స్టేషన్‌కు చెందిన నలుగురు సభ్యుల పోలీసు బృందం సబ్-ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో గోసానినుగావ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బెర్హంపూర్ పోలీసుల సహాయం కోరింది. గోసానినుగావ్ ఇన్‌స్పెక్టర్ స్మ్రుతి నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందం సమన్వయంతో పనిచేసి అనుమానిత ప్రాంతాలన్నింటినీ పరిశీలించింది. దీంతో 28 ఏళ్ల తర్వాత నిందితుడు బ్రహ్మపురలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో నిందితుడు పట్టుబడ్డాడు.. ప్ర‌స్తుతం అత‌డు జైలులో ఊస‌లు లెక్క‌బెడుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement