Saturday, November 23, 2024

Delhi | బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి సోము, సంజయ్.. కొత్తగా 10 మందికి చోటు కల్పిస్తూ ఉత్తర్వులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గంలోకి తెలుగు రాష్ట్రాల మాజీ అధ్యక్షులను తీసుకుంటూ శనివారం రాత్రి బీజేపీ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షులు బండి సంజయ్‌తో మరో 8 మందిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటూ పార్జీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు నియామక ఉత్తర్వులను జాతీయ ప్రధాన కార్యదర్శి, హెడ్‌క్వార్టర్స్ ఇంచార్జి అరుణ్ సింగ్ పేరిట పార్టీ విడుదల చేసింది. మొత్తం 10 మందిని ఒకేసారి జాతీయ కార్యవర్గంలోకి తీసుకోగా.. వారిలో తెలుగు రాష్ట్రాల మాజీ అధ్యక్షులతో పాటు హిమాచల్ ప్రదేశ్‌ మాజీ అధ్యక్షుడు సురేశ్ కశ్యప్, బిహార్ మాజీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్, చత్తీస్‌గఢ్ సీనియర్ నేత విష్ణుదేవ్ సాయి, పంజాబ్ మాజీ అధ్యక్షుడు అశ్విని శర్మ, జార్ఖండ్ మాజీ అధ్యక్షుడు దీపక్ ప్రకాష్, రాజస్థాన్ సీనియర్ నాయకుడు కిరోడీ లాల్ మీనా, రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు సతీష్ పూనియా ఉన్నారు.

- Advertisement -

సంజయ్ పాత్ర పార్టీకే పరిమితమా?

తెలంగాణలో పార్టీ బలోపేతం, విస్తరణ కోసం కేసులు, దాడులను ఎదుర్కొని పోరాడిన మాజీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్‌ను బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటూ జారీ చేసిన ఉత్తర్వులతో సరికొత్త చర్చ మొదలైంది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి అకస్మాత్తుగా తప్పించినందున ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ శ్రేణులు ఆశించాయి. అయితే ఆయన్ను జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడంతో కేంద్ర మంత్రివర్గంలో చోటు ఇస్తారా లేదా అన్న మీమాంస చాలా మందిలో నెలకొంది.

రాష్ట్రాలకు అధ్యక్షులుగా పనిచేసినవారు ఆ తర్వాత జాతీయ కార్యవర్గంలో సభ్యులు అవుతుంటారు. పార్టీ నియమావళి ప్రకారం జరిగే ప్రక్రియే అయినప్పటికీ, సంజయ్ విషయంలో మరింత ప్రాధాన్యత దక్కుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ దశలో సహజంగా జరిగే కార్యవర్గ సభ్యత్వానికి పరిమితం చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

మరోవైపు పార్టీ జాతీయ నాయకత్వం సంజయ్‌ను కేవలం పార్టీకే పరిమితం చేయదల్చుకోలేదని, కేంద్ర మంత్రివర్గంలో కచ్చితంగా చోటు కల్పిస్తుందని కూడా చర్చించుకుంటున్నారు. శనివారం వరంగల్ సభలో సంజయ్ ప్రసంగించే సమయంలో వచ్చిన స్పందన స్వయానా చూసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయనకు కచ్చితంగా ప్రాధాన్యత కల్పిస్తారన్న నమ్మకంతో పార్టీ శ్రేణులున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement