రెయిన్ డీర్ ప్రత్యేకత ఇదే
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో అరుదైన జింక
ట్రాప్ కెమెరాలకు చిక్కిన ఆధారాలు
అరుదైన జాతిగా పేర్కొన్న టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ జైన్
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో అరుదైన మొరిగే జింక కెమెరాకు చిక్కింది. ధమ్తరీ, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని ఉదంతి సీతానంది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ జింక కనిపించింది. ఇది అరుదైన వన్యప్రాణి అని టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ జైన్ తెలిపారు. శునకం మాదిరిగా అరుస్తూ శబ్దాలు చేసే ఈ జింక రెయిన్ డీర్ జాతికి చెందినదని వివరించారు. సాధారణ జింకలతో పోలిస్తే దీని శరీరం కాస్త భిన్నంగా ఉంటుంది.
జింకల్లోనూ పలు రకాలు..
మౌన్జాక్ డీర్, ఇండియన్ కాకడ్, బార్కింగ్ డీర్ (మొరిగే జింక), కోట్రి వంటి వివిధ పేర్లతో జింకలను పిలుస్తారని అరుణ్ జైన్ తెలిపారు. భారత్ సహా దక్షిణాసియాలో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయని వెల్లడించారు. వాటిలో ఒక జాతికి చెందిన జింకలు భారత్‌లోనూ ఉంటాయి కాబట్టి, వాటికి ఇండియన్ కాకడ్ అనే పేరు వచ్చిందన్నారు. కెమెరా కంటికి చిక్కిన ఈ మొరిగే జింక వీడియోను ఉదంతి సీతానంది టైగర్ రిజర్వ్ తమ సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.