తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీనితో ఇటీవల కేసీఆర్ ను కలిసిన వాళ్లంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇక నిజానికి కేసీఆర్ ను ఎవరినైనా కలవాలంటే వారికి కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. అంతే కాకుండా భౌతిక దూరం కూడా ఉండాల్సిందే. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా… కేసీఆర్ కు కరోనా ఎలా వచ్చిందబ్బా అని అనుకుంటున్నారు తెరాస నేతలు.
ఈ నేపధ్యంలోనే కొంత మంది నేతలు నాగార్జున సాగర్‌లోని హాలియాలో నిర్వహించిన బహిరంగ సభ సమయంలోనే కేసీఆర్‌కు కరోనా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. బుధవారం రోజు కేసీఆర్ బహిరంగ సభ జరిగింది. సభలో పాల్గొనేవరకూ చాలా సార్లు మాస్క్ లేకుండానే పార్టీ నేతలతో ముచ్చటించారు. మంత్రులు మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, భగత్‌తో పాటు పలువురు నేతలతో మాస్క్ ధరించకుండానే కేసీఆర్ కు దగ్గరగా గడిపారు. అందుకు సంబంధించి మాస్క్ లేకుండా కేసీఆర్ మంత్రులతో ముచ్చటించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.