ఛండీఘర్ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఛంఢీఘర్లో మంగళవారం ప్రారంభమైన జీఎస్టీ కౌన్సిల్ పలు నిర్ణయాలు తీసుకుంది. పన్నుల రేట్లలో సవరణలు చేసింది. మరికొన్ని కొత్త వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చారు. బంగారం, బంగారు నగలు, ఇతర విలువైన రాళ్ల అంతరాష్ట్ర రవాణాలో సమయంలో ఇక నుంచి రాష్ట్రాలు ఎలక్ట్రానిక్ వే బిల్లులను జారీ చేయడం తప్పనిసరి చేశారు. జీఎస్టీలో రేట్ల సవరణపై వేసిన మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులను కౌన్సిల్ ఆమోదించింది.
మంత్రుల కమిటీ సూచించినవి..
కర్నాటక ముఖ్యమంత్రి బస్వారాజ్ బొమ్మై నేతృత్వంలోని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పన్నుల విషయంలో పలు సూచనలు చేశారు. ప్రధానంగా హోటల్లో 1000 రూపాయిల లోపు అద్దె ఉన్న రూమ్లపై గతంలో పన్ను వినహాయింపు ఇచ్చారు. దీన్ని తొలగించాలని కమిటీ సూచించింది. వీటిని 112 శాతం పన్ను స్లాబులోకి తీసుకు రానున్నారు. ఆసుపత్రుల్లో రోగులు తీసుకునే 5 వేల కంటే ఎక్కువ రెంట్ ఉన్న రూమ్లపై ఇక నుంచి 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. ఐసీయూలకు పన్ను నుంచి మినహాయించారు. పోస్టాఫీస్ సేవల్లో ప్రధానంగా పోస్ట్ కార్డులు మినహా ఇన్లాండ్ లెటర్స్, బుక్ పోస్ట్, 10 గ్రాముల కంటే తక్కువ ఉన్న కవర్లపై పన్ను విధిస్తారు. చెక్లు, చెక్ బుక్కులపై 18 శాతం జీఎస్టీ విధించనున్నారు. వ్యాపార సంస్థలకు ఉండే నివాస సముదాయలపై అద్దెలపై ఉన్న పన్ను మినహాయింపును రద్దు చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు బిజినెస్ క్లాస్లో విమాన ప్రయాణంపై ఉన్న పన్ను రాయితీని రద్దు చేశారు. వ్యాపార సంబంధ జంతువధ శాలలకు ఇచ్చిన పన్ను మినహాయింపును తొలగించారు.
జీఎస్టీ పరిధిలోకి వ్యవసాయ ఉత్పత్తులు..
వ్యవసాయ ఉత్పత్తులు కొన్నింటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చారు. గోడౌన్లో నిల్వ ఉంచే ఉత్పత్తులు, చెరకు, బెల్లం, పత్తి, పూర్తిగా తయారు కాని పొగాకు, వక్క, కాపీ, టీ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చారు.
మరికొన్ని అంశాలపై బుధవారం నిర్ణయం..
రాష్ట్రాలకు చెల్లిస్తున్న జీఎస్టీ పరిహారాన్ని నిలిపివేయడం పట్ల పలు రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయి. పరిహారం చెల్లింపు కొనసాగించాలని లేదంటే జీఎస్టీలో ప్రస్తుతం ఉన్న 50 శాతం వాటాను పెంచాలని కోరుతున్నాయి. క్యాసినో, క్లబ్లు , గుర్రం పందెలు వంటి వాటిపై జీఎస్టీని 28 శాతానికి పెంచాలన్న మంత్రుల కమిటీ సూచనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.