న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో ఒకే రోజు కొందరు నేతలు చేజారిపోగా, మరికొందరు నేతలు కొత్తగా వచ్చి చేరారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఉన్న వివేక్ వెంకటస్వామి, వరంగల్ వెస్ట్ టికెట్ ఆశించి భంగపడ్డ రాకేశ్ రెడ్డి పార్టీని వీడగా.. అదే రోజు ఢిల్లీలో ముగ్గురు నేతలు పార్టీ కండువా కప్పుకున్నారు.
బీజేపీలో చేరినవారిలో బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే (బీఆర్ఎస్) రాథోడ్ బాపూరావు, ఎల్లారెడ్డికి చెందిన కాంగ్రెస్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, మునుగోడుకు చెందిన చలమల కృష్ణారెడ్డి, జహీరాబాద్‌కు చెందిన బాణాల లక్ష్మారెడ్డి ఉన్నారు. వారితో పాటు తమ ముఖ్య అనుచరులు కొందరిని ఢిల్లీకి తీసుకొచ్చి బీజేపీలో చేర్పించారు.
త్వరలో నియోజకవర్గాలకు తిరిగివెళ్లిన తర్వాత పెద్ద ఎత్తున కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటామని ముగ్గురు నేతలు ప్రకటించారు. ఢిల్లీలోని అశోక రోడ్‌లో ఉన్న కిషన్ రెడ్డి నివాసంలో ఈ చేరికలు జరిగాయి. అనంతరం పార్టీలో చేరిన నలుగురు నేతలను కిషన్ రెడ్డి బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు అధిష్టానం పెద్దలను మర్యాదపూర్వకంగా కలిశారు.
నాతోనే నా క్యాడర్: రాథోడ్ బాపూరావు
అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ వృత్తిని వీడి రాజకీయాల్లోకి వచ్చిన తనతో పాటు జిల్లాలోని మరో ఇద్దరు ట్రైబల్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఈసారి టికెట్లు నిరాకరించారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తనకు టికెట్ ఇవ్వకపోగా, కనీసం కలసే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనను తాను గమనిస్తున్నానని, ఆయన పనితీరు నచ్చి బీజేపీలో చేరానని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కలిసి పనిచేసిన ఈటల రాజేందర్‌తో పాటు తెలంగాణ బీజేపీ నాయకత్వంలోని మిగతా నేతల సహాయంతో ముందుకెళ్తానని అన్నారు.
బోథ్ అసెంబ్లీ నియోజకవర్గానికి సోయం బాపూరావు పేరును బీజేపీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో తాను ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని, బీజేపీ అగ్రనాయకత్వం ఆ అవకాశం ఇస్తుందన్న ఆశాభావంతో ఉన్నానని రాథోడ్ బాపూరావు చెప్పారు. తన కేడర్ తనతోనే ఉందని, అందరం కలిసి సోయం బాపూరావును గెలిపించేందుకు పనిచేస్తామని చెప్పారు.
నవంబర్ 3 నుంచి ప్రచారం ఉధృతం: కిషన్ రెడ్డి
ప్రజాక్షేత్రంలో బలంగా ఉన్న నేతల చేరికలతో పార్టీ బలం పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి వరుసగా ఒక్కొక్కరిని పార్టీలోకి ఆహ్వానించి కండువగా కప్పిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 3 నుంచి తమ ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు.
రాష్ట్రంలో అధికార పార్టీపై పూర్తి వ్యతిరేకత ఉందని, అదే సమయంలో కర్ణాటకలో 5 గ్యారంటీలు అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేకపోతోందని తెలిపారు. ఆ రాష్ట్ర రైతులే స్వయంగా తెలంగాణలో పర్యటిస్తూ ఈ విషయం చెబుతున్నారని వెల్లడించారు.
తెలంగాణలో ఖర్చు పెట్టడం కోసం గత ఐదు నెలలుగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ “తెలంగాణ ఎలక్షన్ ట్యాక్స్” వసూలు చేస్తోందని ఆరోపించారు. చెన్నై ద్వారా, ఇతర మార్గాల్లో ఆ డబ్బును తెలంగాణకు పంపించి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఇటు చూస్తే బీఆర్ఎస్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని, ఈ స్థితిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలన్నా.. ప్రజల స్థితిగతులు మెరుగుపడాలన్నా డబుల్ ఇంజిన్ సర్కారుతోనే సాధ్యమని అన్నారు.
వివేక్ బీజేపీ వీడి కాంగ్రెస్‌లో చేరడం గురించి కిషన్ రెడ్డిని ప్రశ్నించగా.. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ ఉందని, అలాంటి పార్టీలో ఒకరిద్దరు నేతలు వ్యక్తిగత కారణాలతో వెళ్లిపోతే వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు. తమది వ్యక్తి ఆధారిత పార్టీ కాదని, దేశం కోసం పనిచేసే కేడర్ ఆధారిత పార్టీ అని తెలిపారు.
వివేక్ రూపొందించి అందజేసిన మేనిఫెస్టోపై అధిష్టానం పెద్దలతో చర్చ జరుగుతోందని, అందులో మార్పులు, చేర్పులు చేసి అధికారికంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు. మరోవైపు జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.