తిరుపతి : తిరుపతి కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన సోమవారం ఉదయం శ్రీ సోమస్కందమూర్తి, కామాక్షి అమ్మవారి సమేతంగా భూత వాహనంపై అభయమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. పూర్వం క్రూరభూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుని బ్రహ్మదేవుడు ఆ భూతాల నుంచి లోకాలను కాపాడమని వేడుకున్నారు. ఈ కార్యానికి నిర్జన ప్రదేశాలైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు. భూతాలను వశీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మసృష్టిని రక్షిస్తున్నాడని, నాటి నుండి ”భూతపతి”గా కీర్తించే జీవులకు భయాలను తొలగించి శివుడు రక్షిస్తున్నాడని భక్తుల విశ్వాసం. అందుకు ప్రతీకగా లయకారుడు భూతవాహనంపై అభయమిచ్చారు. అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ దేవేంద్ర బాబు, ఏఈఓ పార్థ సారధి, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్ స్పెక్టర్లు రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement