న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోని విభజన సమస్యలు చాలా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు గుర్తుచేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఉదయం గం. 10.00 సమయంలో అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. గురువారం ఢిల్లీ చేరుకున్న ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసిన విషయం తెలిసిందే. అమిత్ షాతో జరిగిన భేటీలో సౌత్‌జోనల్ కమిటీ సమావేశంలో భాగంగా ప్రస్తావించిన విభజన సమస్యలు, వాటి పరిష్కార ప్రక్రియపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అధికారుల సమావేశాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఆస్తుల పంపకం సహా విభజన సమస్యలన్నీ కూడా పెండింగులో ఉన్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని సీఎం మరోమారు హోంమంత్రికి విజ్ఞప్తిచేశారు. అనంతరం తన పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల రాజకీయం..
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా కీలకంగా మారింది. ప్రధానితో జరిగిన సమావేశంలోనే దీని గురించి చర్చించినప్పటికీ, తదుపరి అమిత్ షాతో కూడా మరోసారి చర్చించినట్టు తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఆ పార్టీ మద్ధతును కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కోరుతోంది. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎన్డీయే కూటమి అభ్యర్థికి మద్ధతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి ఆ పార్టీ సంఖ్యాబలం మరింత ఎక్కువగా ఉంది. పైగా ఎన్డీయే కూటమికి పూర్తి సంఖ్యాబలం లేదు. దీంతో వైఎస్సార్సీపీ, బీజేడీ వంటి తటస్థ రాజకీయ పార్టీల మద్ధతు అవసరమవుతోంది. ఇప్పటికే బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో బీజేపీ అగ్రనాయకత్వం చర్చలు జరిపింది. తాజాగా వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా ఇదే తరహాలో మంతనాలు సాగిస్తోంది. అయితే గత ఎన్నికల్లో దళిత అభ్యర్థిని బరిలోకి దింపినందున, రాజకీయ సమీకరణాల రీత్యా మద్ధతిచ్చిన వైఎస్సార్సీపీ, ఈసారి కూడా అభ్యర్థిని చూసి తమ మద్ధతు విషయం తేల్చుతామని చెప్పినట్టు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..