తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈరోజు సచివాలయంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డి కలిశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, పంటల కొనుగోలు దిశగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని…. వానలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పినా అది అమలు కావడం లేదని చెప్పారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనాలని అన్నారు. రైతులకు బోనస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు రసీదులు ఇవ్వడం లేదని సీఎంకి చెబితే అధికారులను పిలిచి సీఎం ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
మిగిలిన రైతు బంధుతో పాటు, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరామని అన్నారు. తమ వినతిపై ప్రభుత్వం స్పందించకుంటే బీజేపీ ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళ్తుందని చెప్పారు. దేశంలో పదేళ్లుగా బీజేపీ సుస్థిర పాలనను అందిస్తోందన్నారు.