Tuesday, November 19, 2024

ఏపీ రైల్వే సమస్యలను పరిష్కరించండి.. సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌కు నిధులివ్వండి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విభజనతో ఏర్పడిన లోటుతో ఇబ్బందిపడుతున్న ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. విభజన తర్వాత రాష్ట్రానికి రూ.16వేల కోట్ల రూపాయల లోటు ఉందని, రాష్ట్రానికి అదనంగా నిధులు కేటాయించాలని, మంజూరు చేసిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. మంగళవారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌పై ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి కేటాయించిన రూ.9వేల కోట్ల బడ్జెట్‌ను సమర్థంగా వినియోగించాలని సూచించారు. 2014కి ముందు మంజూరైన కొత్త రైల్వే లైన్‌లు కొత్తపల్లి – నర్సాపూర్, గుడూరు – దుగ్గిరాజ పట్నం, నడికుడి – శ్రీకాళహస్తి, ఖమ్మం – పొద్దుటూరు, కొండపల్లి – కొత్తగూడెం, కడప – బెంగులూరు, భద్రచాలం – కొవ్వూరు, తుమ్కూరు – రాయగూడ, మరికప్పం – కుప్పం రైల్వే లైన్లు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూకేటాయింపులు, నిధులు సమకూర్చటం లేదని కేంద్రం సాకుగా చూపిస్తోందని, 14 తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిందని శ్రీకృష్ణ చెప్పుకొచ్చారు.

గతంలో జార్ఖండ్‌ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొనసాగించాలని విన్నవించారు. మూడేళ్ల క్రితం మంజూరు చేసిన సౌత్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ అభివృద్ధిలో పురోగతి లేదని, కేంద్రం వీలైనంత త్వరగా నిధులు చేసి ఈ జోన్‌ను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. మిర్చి, పత్తి, పొగాకు వంటి ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న గుంటూరు రైల్వే స్టేషన్‌ రీమోడలింగ్‌ అంశం గురించి కేంద్రాన్ని ఎంపీ ప్రశ్నించారు. చాలా ఏళ్ల తర్వాత గుంటూరు స్టేషన్‌ రీమోడలింగ్‌కు కేటాయించిన రూ.80కోట్ల నిధులను రద్దు చేసి ఇతర స్టేషన్ల అభివృద్ధికి కేటాయించడాన్ని ఆయన దుయ్యబట్టారు. రద్దు చేయటానికి గల కారణాలను వివరించి, తిరిగి నిధులు కేటాయించాలని అభ్యర్థించారు. సికింద్రాబాద్‌ – గుంటూరు వరకు గతంలో 14 రైళ్లుండగా ప్రస్తుతం 10 మాత్రమే నడుస్తున్నాయని వివరించారు. తగినంత ఆదాయం రావట్లేదని నడికుడి రైల్వే స్టేషన్‌లో రైళ్లను ఆపడం లేదని, స్టేషన్‌లో టికెట్‌ బుకింగ్‌ వంటి సౌకర్యాలు మెరుగుపడితే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందన్న శ్రీకృష్ణ, ఈ సమస్యను పరిష్కరించి పల్నాడు ప్రజానీకానికి మేలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement