Saturday, November 16, 2024

ఔటర్‌పై సోలార్‌, తొలుత 21 కి. మీలలో ఏర్పాటుకు సన్నద్దం..

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ : మహానగరానికి మణిహారంగా మారిన ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై సోలార్‌ రూప్‌ టాఫింగ్‌ కారిడార్‌ను నిర్మించడానికి హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ (హెచ్‌ఎండీఏ) సిద్దమవుతుంది. మొదటి విడతలో కనీసం 9 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళాలని ప్రతిపాదనలు సిద్దం చేశారు. ముందుగా నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్‌ అకాడమీ వరకు 8 కిలోమీటర్ల పొడవున , నార్సింగి నుంచి కొల్లూర్‌ వరకు 13 కిలోమీటర్ల పొడవున మొత్తం 21 కిలోమీటర్ల పొడవున ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా ఉన్న సర్వీస్‌ రోడ్లను విస్తరిస్తున్న క్రమంలో నిర్మించ తలపెట్టిన సైకిల్‌ ట్రాక్‌పై సోలార్‌ రూప్‌ టాప్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ పర్యావరణవేత్త ఎరిక్‌ సాల్హెమ్‌ సౌత్‌ కోరియాలో రోడ్డు మధ్యలో సోలార్‌ రూఫ్‌ టాప్‌ తో ఉన్న సైకిల్‌ ట్రాక్‌ వీడియోను ట్విట్‌ చేయడంతో ఆ ఆలోచనను మంత్రి కేటీఆర్‌ అమలు చేయడానికి పూనుకున్నారు.

తక్షణమే హైదరాబాద్‌ చుట్టురా ఉన్న ఓఆర్‌ఆర్‌పై సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రెండు నెలల క్రితం హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించారు. దీనితో మున్సిఫల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫ్రిన్సిఫల్‌ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ ఆర్వింద్‌కుమార్‌ స్పందించి ఓఆర్‌ఆర్‌పై సోలార్‌ రూఫ్‌ టాప్‌ నిర్మాణానికి ఆదేశాలు జారీ చేయడంతో ఇంజనీరింగ్‌ అధికారులు డిజైన్లు రూపొందించారు. సర్వీస్‌ రోడ్డు విస్తరణ పనులతో పాటు నిర్మిస్తున్న సైకిల్‌ ట్రాక్‌పై సొలార్‌ రూఫ్‌ టాప్‌ను కూడా చేయడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా పనులన్ని ఒకేసారి పూర్తవుతాయని అధికారులు బావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement