Friday, November 22, 2024

సౌర వెలుగులు, సామాన్యులకు ఇక్కట్లు.. గిట్టుబాటు కాదంటున్న ప్రైవేట్‌ కంపెనీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇళ్లపై సౌర విద్యుత్‌ ఏర్పాటుకు ముందుకొస్తున్న సామాన్యులకు నిరాశ తప్పడం లేదు. ప్రభుత్వం ఖరారు చేసిన ధరలపై సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటుకు ప్రయివేట్‌ సోలార్‌ సంస్థలు ససేమిరా అంటున్నాయి. రాష్ట్రంలో ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల భవనాల ( రూఫ్‌టాప్‌) పై రాయితీతో ఏర్పాటు చేసే సౌర విద్యుత్‌ పనులు దాదాపుగా నిలిచిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం (2021- 22) కోసం గత జనవరిలో రూఫ్‌టాప్‌ ధరలను తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి ( టీఎస్‌ రెడ్కో ) సంస్థ టెండర్లు ఖరారు చేసింది. ఒక కిలోవాట్‌కు రూ.52 వేల ధరను నిర్ణయించింది. వినియోగదారులు రాయితీ పోను రూ.37,330 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇదే విధంగా 2 నుంచి 3,4,5,10 కిలోవాట్ల వరకు సంబంధించిన ధరలను టెండర్ల ద్వారా నిర్ణయించారు. ఇవే ధరలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ( 2022-23 ) లోనూ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సూచించింది. ఈ ఏడాది 25 వేల కిలోవాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల సౌర విద్యుత్‌ ఏర్పాటుకు రాష్ట్రంలో ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

కానీ, జనవరి నుంచి ఇప్పటీ వరకు కేవలం 1,800 కిలోవాట్ల సామర్థ్యం గలవి ( 7.2 శాతం) మాత్రమే ఏర్పాటు చేశారు. టెండర్ల ద్వారా ఖరారు చేసిన ధరలకు సౌర విద్యుత్‌ ఏర్పాటుకు సోలార్‌ సంస్థలు విముఖత చూపుతున్నాయి. సామాగ్రి ధరలు పెరిగాయనీ, పైగా బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ ( బీసీడీ)ని కూడా కేంద్రం పెంచిందని సోలార్‌ సంస్థలు చెబుతున్నాయి. దీంతో కిలోవాట్‌కు అదనంగా మరో రూ. 8 వేల చెల్లించాలని సోలార్‌ కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. టెండర్లు ఖరారు చేసి నాలుగు నెలలో అయిందని, అప్పుడే ధరలు పెంచడం సాధ్యం కాదని టీఎస్‌ రెడ్కో వాదిస్తోంది. ఈ అంశంపై ఈ నెల 23న కేంద్ర నూతన, సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ( ఎంస్‌న్‌ఈఆర్‌ఈ)తో చర్చించాలని సంస్థ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లోని ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది.

కాగా, సోలార్‌ కంపెనీలు సహకరించకపోతే తెలంగాణకు కేటాయించిన 25 వేల కిలోవాట్ల సౌర విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు కేంద్రం మళ్లిస్తుందేమోనని సంబంధిత అధికారులు ఆందోళన చెందుతున్నారు. సౌర పలకలను కంపెనీలు ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే చైనా నుంచి దిగుమతి తగ్గించాలని, స్వదేశీ తయారీ, వినియోగం పెంచాలనే ఉద్దేశంతో సౌర పలకల దిగుమతిపై కేంద్రం బేసిక్‌ కస్టమ్‌ సుంకం ( బీసీడీ) ని 10 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. అయితే దేశీయంగా ఫలకాల లభ్యత తక్కువగా ఉందని, దిగుమతి సుంకం పెంచడం వల్ల తాము ధరలు పెంచాల్సి వస్తోందని సోలార్‌ కంపెనీలు వాదిస్తున్నాయి. 5 కిలోవాట్‌ సామర్థ్యం గల రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్‌ ప్యానెళ్ల తయారీకి 150 కిలోల వరకు స్టీల్‌ వాడతారు. గతంలో స్టీల్‌ ధర కిలోకు రూ. 45 ఉండేదని, ఇప్పుడు రూ. 75కి చేరింది. అల్యూమినియం 40 కిలోలు అవసరం అవుతుంది. దీని ధర కిలోకు రూ. 140 నుంచి రూ. 150కి పెరిగింది. ఈ కారణంగా ఒక కిలోవాట్‌ సామర్థ్యం గల ప్యానెళ్ల ధర సగటున రూ. 8 వేలు పెరిగిందని, అందువల్ల ప్రస్తుత ధరలకు సౌర విద్యుత్‌ ఏర్పాటు సాధ్యపడటం లేదని ప్రభుత్వానికి సోలార్‌ కంపెనీలు తెలిపాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement