న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం ఢిల్లీలోని సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభించిన నేపథ్యంలో ఆయన తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరయ్యారు. ఎస్సీల్లో వర్గీకరణ కోరుతున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) నేతలు కూడా ఆయన వెంట ఉన్నారు.
ఈ సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. సామాజిక న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలని, అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ కూడా అమల చేయాలని అన్నారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, ఆయన సూచనలు, దిశానిర్దేశం మేరకు తాను ఢిల్లీ వచ్చానని తెలిపారు. వర్గీకరణకు అనుకూలంగా వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది వివేక్ థంకాను తెలంగాణ ప్రభుత్వం తరఫు నియమించినట్టు ఆయన వెల్లడించారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ముద్ర, తెలంగాణ తల్లి రూపుపై ప్రజాభిప్రాయం సేకరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. గత ప్రభుత్వం విస్మరించి, నిర్లక్ష్యం చేసిన వర్గాలను తమ ప్రభుత్వం గుర్తించి, గౌరవిస్తోందని తెలిపారు. గద్దర్, అందెశ్రీ సహా అనేక మంది త్యాగ మూర్తులకు ప్రభుత్వం తగిన గుర్తింపు, గౌరవం కల్పిస్తోందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరి వాటా వారికి దక్కాల్సిన అవసరం ఉందని అన్నారు. సుప్రీంకోర్టులో మాకు సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.