హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ బడుల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం స్నాక్స్ (అల్పాహారం) అందించనుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి వార్షిక పరీక్షలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నారు. దీంతో విద్యార్థులు ఖాళీ కడుపుతో తరగతులు వినేపరిస్థితి లేకపోవడంతో వారికి అల్పాహారం అందించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు అంటే 34 పనిదినాల పాటు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలో సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్య్‌ర్థులకు స్నాక్స్ అందించనుంది. ఆరోగ్యకరమైన, వేడి వేడి స్నాక్స్ అందించే విధంగా అధికారులకు ఆదేశించింది.
ఒక్కో విద్యార్థికి యూనిట్ ఖర్చుగా రోజుకు రూ.15గా నిర్ణయించించి జిల్లా డీఈఓలకు అవసరమైన బడ్జెట్‌ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. మధ్యాహ్న భోజన ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు స్నాక్స్ అందించాలని అధికారులను ఆదేశించింది. మొత్తం 4785 ప్రభుత్వ, జెడ్పీ, మోడల్ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 1,89,791 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. పదో తరగతిలో మంచి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించాలని జిల్లా విద్యాధికారులను విద్యాశాఖ ఆదేశించింది. ఈమేరకు విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏప్రిల్ 12 నుండి ఎస్‌ఏ-2 పరీక్షలు…
ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ)-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది.