Friday, November 22, 2024

ఏపీ, తెలంగాణలో స్మగుల్డ్​ బంగారం.. భారీగా స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ

అమరావతి, ఆంధ్రప్రభ: : తెలుగు రాష్ట్రాల్లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటిలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు పెద్ద ఎత్తున స్మగ్లింగ్‌ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మార్గంలో బంగ్లాదేశ్‌ నుంచి కోల్‌కత్తా మీదుగా వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై అధికారులు నిఘా పెట్టి, రెండు వేర్వేరు కేసుల్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, రూ.5.58 కోట్ల విలువైన 9.710 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. డీఆర్‌ఐ అధికారుల సమాచారం ప్రకారం..కోల్‌కత్తా నుంచి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున స్మగ్లింగ్‌ బంగారం రైళ్ల ద్వారా చేరుతున్నట్లు వచ్చిన సమాచారంపై సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిఘాను పటిష్టం చేశారు.

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు దిగిన ఓ వ్యక్తిని అనుమానంపై అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా రూ.1.32 కోట్ల విలువైన 2,314 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఇతనిని అదుపులోకి తీసుకున్న మరుసటి రోజు శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌లో హౌరా టు చెన్నై వెళ్లే చెన్నై మెయిల్‌ నుంచి దిగిన ఓ వ్యక్తిని విశాఖపట్టణం డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో ఇతనిని కలిసేందుకు ప్లాట్‌ఫారంపైకి చేరుకున్న మరో వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా కోల్‌కత్తా నుంచి వచ్చిన వ్యక్తి బాగులో ఉన్న రూ.4.21 కోట్ల విలువైన 7.396 కిలోల ఎనిమిది బంగారు కడ్డీలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన బంగారం 24 క్యారెట్ల ప్యూర్‌ గోల్డ్‌గా అధికారులు నిర్థారించారు. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ మార్గంలో బంగారాన్ని కోల్‌కత్తా నుంచి తరలించి కడ్డీల రూపంలో మార్చుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు రైలు మార్గంలో వీటిని తీసుకెళ్లి వ్యాపారులకు అందజేస్తున్నట్లు గుర్తించారు. గత కొంతకాలంగా సాగుతున్న ఈ తరహా స్మగ్లింగ్‌పై డీఆర్‌ఐ అధికారులకు కీలక సమాచారం చేరింది. ఇందులో భాగంగా వేర్వేరు రైల్వేస్టేషన్లలో నిఘాను పటిష్టం చేసి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. బంగారం కోల్‌కత్తా నుంచి ఎక్కెడెక్కడకు వెళుతోంది? ఎవరు కొనుగోలు చేస్తున్నారు? తదితర వివరాలను డీఆర్‌ఐ అధికారులు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement