Tuesday, November 26, 2024

చిన్న పరిశ్రమలే దేశానికి పట్టుగొమ్మలు : గుడివాడ అమర్నాథ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలే దేశానికి పట్టుగొమ్మలని, ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ రానున్న రెండేళ్లలో రూ. 15,000 కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ఉద్యమి భారత్’ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ నేషనల్ బోర్డ్ సభ్యులుగా ఉన్న అనకాపల్లి ఎంపీ డా. సత్యవతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తో కలిసి రాష్ట్ర మంత్రి అమర్నాథ్ పాల్గొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగానికి ఇప్పటి వరకు రూ. 1,700 కోట్లు ప్రోత్సాహకాలుగా ఇచ్చామని, వచ్చే ఆగస్టు నెలలో మరో రూ. 500 కోట్లు అందజేయాలని నిర్ణయించామని తెలిపారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో 1.25 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తద్వారా రూ. 15వేల కోట్ల పెట్టుబడులతో 1.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకుంటామని తెలిపారు.

ఎంపీ డా. సత్యవతి మాట్లాడుతూ 130 కోట్లకు పైగా జనాభా కలిగిన భారతదేశంలో 40 శాతం యువత ఉన్నారని తెలిపారు. దేశం ఆర్థికంగా పురోగమించాలంటే ప్రతి ఒక్కరు తమ కాళ్లపై తాము నిలబడే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాల్సి ఉందన్నారు. ఈ రంగంలో అత్యధికంగా రుణాలు అందించి గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కల్పించేలా పథకాలు రూపొందించినట్టు తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగంలో మహిళలు ఎక్కువగా కనిపించడం తనకు సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, వారే ఉద్యోగాలు సృష్టించేలా తయారవ్వాలని ప్రధాన మంత్రి మోదీ చెబుతున్నారని ఆమె గుర్తుచేశారు. యువత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సహకారాన్ని అందుకుని ఎంఎస్ఎంఈ రంగంలో పురోగమించాలని కోరారు. అప్పుడే దేశం ఆర్థికంగా పురోగమించి అగ్రస్థానానికి చేరుకుంటుందని అన్నారు. ప్రపంచానికే మార్గదర్శిగా, స్ఫూర్తిదాయకంగా, విశ్వగురుగా భారతదేశాన్ని నిలిపే శక్తి యువతకే ఉందని డా. సత్యవతి అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement