Saturday, November 9, 2024

ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రికి 24కోట్ల భారీ జరిమానా.. తప్పుడు వివరాలతో ఆస్థిపన్ను దాఖలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: చిన్నరోగంతో చికిత్స కోసం వచ్చినా రోగుల నుంచి ఇబ్బడి ముబ్బడిగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేటు/కార్పోరేటు ఆసుపత్రులు … ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను మాత్రం నిర్ధాక్షిణ్యంగా ఎగ్గొడుతున్నాయి. తమకు తీసుకోవడమే తెలుసుకాని… ఇవ్వడం తెలియదన్న వైఖరిని ప్రయివేటు/కార్పోరేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రదర్శిస్తున్నాయి. తాజాగా ఆస్థిపన్ను స్వీయ మదింపులో తప్పుడు వివరాలు సమర్పించిన ఓ ఆసుపత్రి యాజమాన్యానికి నిజాంపేట నగరపాలక సంస్థ అధికారులు రూ.24కోట్ల భారీ జరిమానా విధించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌ బాచుపల్లిలోని ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రికి రూ.24కోట్ల భారీ జరిమానా ను నిజాంపేట నగరపాలక సంస్థ విధించింది. ఈ మేరకు రూ.24కోట్ల జరిమానాతో కూడిన నోటీసులను జారీ చేశారు. ఆస్తిపన్ను స్వీయ మదింపులో తప్పుడు వివరాలు సమర్పించినందుకు జరిమానాను విధించినట్లు అధికారులు వెల్లడించారు. బాచుపల్లిలోని ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రి 4 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందుకుగాను 2 సెల్లార్లు, గ్రౌండ్‌ ఫ్లోర్‌తో సహా 9 అంతస్థులకు నగరకపాలక సంస్థ నుంచి అనుమతి ఉంది.

కేవలం 4 అంతస్థుల్లోనే 32, 300 చదరపు గజాలుగా పేర్కొంటూ ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రి స్వీయ మదింపు వివరాలను సమర్పించింది. వాస్తవానికి 10లక్షల చదరపు గజాల్లో ఆసుపత్రి నిర్మాణం ఉందని అధికారుల తనిఖీల్లో తేలింది. ఈ ఘటనపై కూలంకషంగా విచారణ చేపట్టిన నిజాంపేట నగరపాలక సంస్థ అధికారులు ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రి సమర్పించిన వివరాలు తప్పుగా ఉన్నాయని నిర్ధారించారు. తెలంగాణ మున్సిపల్‌ చట్టం ప్రకారం… దరఖాస్తుదారుడు స్వీయ ఆస్థిపన్ను మదింపులో ఇచ్చిన వివరాలు తప్పుగా ఉంటే సదరు ఆస్థి విలువకు 25రెట్ల జరిమానా విధించాలని నిబంధనలు చెబుతున్నాయి. విచారణ అనంతరం నిబంధనల మేరకు రూ.24కోట్లకు పైగా జరిమానాను నిజాంపేట నగరపాలక సంస్థ ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రిపై విధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement