Tuesday, November 19, 2024

Vande Bharat | స్లీపర్ ట్రైన్ ప్రోటోటైప్ వెర్షన్‌ ఆవిష్కరణ…

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు (ఆదివారం) వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రొటోటైప్ వెర్షన్‌ను ఆవిష్కరించారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్‌ ) ఫెసిలిటీలో వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వందేభారత్ చైర్ కార్ విజయం తర్వాత…. వందే భారత్ స్లీపర్ కోచ్ల‌ కోసం చాలా శ్రమించామ‌న్నారు. కొత్త రైలు రూపకల్పన చాలా క్లిష్టమైన పని అని, వందే భారత్ స్లీపర్ కార్లలో అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు.

వీటి తయారీ ఇప్పుడే పూర్తయిందని, పది రోజుల పాటు కఠిన పరీక్షలు, ట్ర‌య‌ల్ రన్స్ నిర్వహిస్తామని వైష్ణవ్ తెలిపారు. రానున్న మూడు నెలల్లో వందే భార‌త్ స్లీప‌ర్ కోచ్ సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. వందే భారత్‌లో నాసిరకం ఆహార పదార్థాల ఫిర్యాదులపై మంత్రి మాట్లాడుతూ, భారతీయ రైల్వే రోజుకు 13 లక్షల భోజనాన్ని అందిస్తోందని, ఫిర్యాదులు 0.01 కంటే తక్కువగా ఉన్నాయని చెప్పారు.

అయితే ఇప్ప‌టికే అందిన ఫిర్యాదులపై చాలా ఆందోళన చెందుతున్నామని… సంబంధిత క్యాటరర్లు, సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. కాగా, బీఈఎంఎల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన వందేభారత్‌ తయారీ కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. బీఈఎంఎల్‌ కాంప్లెక్స్ సమీపంలో 9.2 ఎకరాల విస్తీర్ణంలో కొత్త హ్యాంగర్ సదుపాయానికి వైష్ణవ్ శంకుస్థాపన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement