హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్రంలో తొలిసారిగా టీఎస్ ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇందులో భాగంగా ముందుగా 4 స్లీపర్, మరో 6 స్లీపర్ కమ్ సీటర్ బస్సులను ప్రారంభించనుంది. ప్రైవేటు బస్సులకు ధీటుగా అత్యాధునిక హంగులతో రూపొందించిన ఈ బస్సులు బుధవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్, కాకినాడ, విజయవాడ మార్గాలలో అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడుపనుంది. హైదరాబాద్ కెపిహెచ్‌బి కాలనీ దగ్గర బుధవారం సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జన్నార్ ఈ కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు.
బస్సు ప్రత్యేకతలివే…
స్లీపర్ బస్సులలో లోయర్ బెర్తులు 15, అప్పర్ బెర్తులు 15 ఉంటాయి. ప్రతీ బెర్త్ వద్ద వాటర్ బాటిల్ సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. సీటర్ కమ్ స్లీపర్ బస్సుల్లో 15 అప్పర్ బెర్తులతో పాటు లోయర్ లెవల్‌లో 33 సీట్ల సామర్ద్యం ఉంటుంది. ప్రతీ బస్సుకు ఎయిర్ సస్పెన్షన్ సదుపాయం కూడా కల్పించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతీ బస్సులోనూ వైఫై సదుపాయాన్ని కల్పించారు. ఈ బస్సుల్లో ప్రయాణించే వారికి సైతం ఒక వాటర్ బాటిల్ ఉచితంగా అందజేయడంతో పాటు తమ లగేజి లోడింగ్, అన్ లోడింగ్‌కు అటెండెంట్లు సహకరిస్తారు. బస్సుకు ముందు వెనక ఎల్‌ఈడీ బోర్డులు ఉంటాయి. గమ్యస్థానాల వివరాలు, తెలుగు ఇంగ్లీషు భాషలలో కనిపిస్తాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతీ బస్సులోనూ మూడు సిసి టివి కెమెరాల ఏర్పాటుతో పాటు ఫ్రంట్ రోడ్ వ్యూ, ప్రయాణికులు బస్సు ఎక్కే ప్రాంతం, బస్సు లోపలి ప్రాంతంలోనూ కెమెరాలు అమర్చారు. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా మరొక కెమెరా ఉంటుంది. అంతేకాకుండా, అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అగ్ని మాపక పరికరాలు బస్సుల్లో ఉంటాయి. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు విశాలంగా బెర్త్‌లు ఉండటం ఈ బస్సుల ప్రత్యేకత.
బస్సులు బయలుదేరే వేళలివే…
కాగా, కాకినాడ వెళ్లే బస్సులు హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్ నుంచి ప్రతీ రోజు రాత్రి 8-30కు, తిరిగి కాకినాడ నుంచి రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్‌కు ప్రారంభమవుతాయి. అలాగే, విజయవాడ వైపునకు వెళ్లే బస్సులు ప్రతీ రోజు మియాపూర్ నుంచి ఉదయం 9.30గంటలకు, రాత్రి 9-30గంటల కు బయలుదేరతాయి. విజయవాడ నుంచి తిరిగి హైదరాబాద్‌కు ఉదయం 10-15కు, మధ్యాహ్నం 12.15కు, అర్ధరాత్రి 12-45కు బయలుదేరతాయి.