Tuesday, November 26, 2024

Delhi | విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ.. విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మహిళలకు నైపుణ్య శిక్షణ కోసం దేశంలో ప్రత్యేకంగా 19 జాతీయ మహిళా నైపుణ్య శిక్షణా సంస్థలు (ఎన్ఎస్టీఐ) పనిచేస్తున్నాయని కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్‌ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా 33 ఎన్‌ఎస్‌టీఐలు వాటికి అనుబంధంగా మూడు కేంద్రాలు నెలకొల్పినట్లు తెలిపారు. ఇందులో 19 ఎన్‌ఎస్టీఐలు ప్రత్యేకంగా మహిళల కోసం నెలకొల్పినవేనని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు హైదరాబాద్‌లో 3 ఎన్‌ఎస్‌టీఐలు నెలకొల్పగా అందులో ఒకటి మహిళల కోసం ప్రత్యేకించిందని మంత్రి చెప్పారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌ఎస్‌టీఐ నెలకొల్పలేదని చెబుతూ విశాఖపట్నం గాజువాకలోని క్రాఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రైనింగ్‌ ట్రైనర్స్‌ (సీఐటీఎస్‌)ను అనుబంధ సంస్థగా ప్రకటించి 2022-23 నుంచి ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, వెల్డర్‌ వంటి ట్రేడ్లలో శిక్షణను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఈ మూడు ట్రేడ్లలో 75 మందికి శిక్షణ పొందే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement