Tuesday, November 26, 2024

Delhi | స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ నిజం-స్కాం అబద్దం.. సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి, మనీ లాండరింగ్ జరగలేదని సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సుమన్ బోస్ వెల్లడించారు. ఆదివారం ఆయన న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యుషన్ క్లబ్‌లో ఆయన విలేకరుల సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ బోస్ మాట్లాడుతూ… ఈ ప్రాజెక్ట్ పూర్తిగా విజయవంతమైందని చెప్పుకొచ్చారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రెండు వందలకు పైగా ల్యాబ్‌లను ప్రారంభించామని గుర్తు చేశారు. 2021 వరకు రెండు లక్షలకు  పైగా విద్యార్థులు దీని ద్వారా నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకున్నారని… బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీఓటీ) పద్ధతిలో ఈ ప్రాజెక్ట్ అమలైందని తెలిపారు.

2021లో ప్రాజెక్టును, స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణా కేంద్రాలను  రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామన్నారు. ఈ ప్రాజెక్టులో అవినీతి, మనీ లాండరింగ్ అంటూ నిరాధార ఆరోపణలు మాత్రమే చేస్తున్నారని సుమన్ బోస్ దుయ్యబట్టారు. 2018లోనే తాను ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోయానని, 2021 తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయని వివరించారు. సీమెన్స్ సంస్థ ఎండీగా తాను, తమ సీఎఫ్‌ఓ సంతకాలు చేశాక అగ్రిమెంట్ జరగలేదంటే ఏమనాలని ప్రశ్నించారు. 90 శాతం షేర్ సిమెన్స్ ఇవ్వడం వల్ల సంస్థకు చాలా ప్రయోజనం ఉందని,. సంస్థ మార్కెటింగ్‌కు ఇదో మంచి బిజినెస్ ఐడియా అని సుమన్ బోస్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

సీమెన్స్ సంస్థ తన వాదనతో విభేదిస్తుందని తాను అనుకోవట్లేదని చెప్పుకొచ్చారు. సీమెన్స్ సంస్థ ఇచ్చిన గ్రాంట్ వివిధ రూపాల్లో ఉందని అన్నారు. డిస్కౌంట్లు సహా అనేక రూపాల్లో ఉందని, నేరుగా పెట్టుబడి (డబ్బు) రూపంలో లేదని వివరించారు. సీమెన్స్‌కు వంద కోట్ల రూపాయల వరకు వచ్చాయని, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ టెక్‌కి రూ.371 కోట్లు ఇచ్చిందని,వాళ్ళు తమకు సుమారు రూ. 100 కోట్లు ఇచ్చారని వెల్లడించారు. తమ సంస్థ ప్రధాన కార్యాలయానికి చెప్పకుండా తాను ఏ పనీ చేయలేదని చెప్పారు.

సీమెన్స్ నుంచి బయటకు వచ్చాక తనకు సంస్థ డాక్యుమెంట్స్ యాక్సెస్ ఇవ్వలేదని తెలిపారు. సీమెన్స్ ఇంటర్నల్ రిపోర్ట్ నవ్వు తెప్పించిందని సుమన్ బోస్ అన్నారు. ఎక్కడైనా విచారణ జరిపేటప్పుడు సంబంధిత వ్యక్తికి తన వాదన వినిపించే అవకాశం ఇస్తారని, కానీ ఈ కేసులో తనకు అసలు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండానే రిపోర్ట్ కోర్టులో సమర్పించారని విమర్శించారు. ఆ తర్వాత రిపోర్ట్ చూస్తే నవ్వు తెప్పించేలా ఉందని అన్నారు. ఈ కేసు నుంచి పూర్తిగా క్లీన్ చిట్ వస్తుందన్న నమ్మకం తమకు ఉందని సుమన్ విశ్వాసం వ్యక్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement