అమరావతి – టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. తీర్పును రేపు ఉదయం వెలువరించనున్నారు.. కాగా,చంద్రబాబును పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేశామని, ఆయనను విచారించడం కోసం ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరుపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వాదనలు వినిపించారు. అయితే ఆయనను సిట్ కార్యాలయంలోనే విచారించారని, అసలు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని, కాబట్టి కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించాలని చంద్రబాబు తరుపు న్యాయవాది సిద్ధార్థ లూద్రా కోర్టును కోరారు . నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ అధినేత అరెస్ట్ జరిగిందన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కస్టడీని కోరుతున్నారన్నారు. చంద్రబాబుకు సీఐడీ కస్టడీ అవసరం లేదన్నారు. ఆయన అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్నారు.
నాలుగేళ్లుగా ఎవరిని అరెస్ట్ చేసినా నిధుల దుర్వినియోగం అంటున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రతో కూడుకున్నదన్నారు. చంద్రబాబుకు అక్రమాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన అవినీతికి పాల్పడినట్లుగా ఆధారాలు కూడా చూపించలేదన్నారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు. అరెస్ట్ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు. ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న ఆయనను రెండు రోజుల పాటు విచారణ పేరుతో ఇబ్బందికి గురి చేశారన్నారు. ఆధారాలు లేకుండా కస్టడీని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఆయనను అరెస్ట్ చేసిన సమయంలోనే సిట్ కార్యాలయంలో విచారించారన్నారు. కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించాలన్నారు.