మంచిర్యాల, ప్రభన్యూస్ ప్రతినిధి: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం అర్దరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. రాత్రి గాఢ నిద్ర సమయంలో ఈ ఘటన జరగడంతో ఇంట్లోని వారంతా మృత్యువాతపడ్డారు. ఇందులో ఇంటి యజమాని మాసు శివయ్య(50), అతని భార్య రాజ్యలక్ష్మి అలియాస్ పద్మ(45), రాజ్యలక్ష్మి అక్కకూతురు మౌనిక(22), మౌనిక ఇద్దరు కూతుర్లు, మరో వ్యక్తి శాంతయ్య(53) మృతి చెందిన వారిలో ఉన్నారు. ఇంటి యజమాని శివయ్య, భార్య రాజ్యలక్ష్మికి ఆర్కే-5బిలో మైనింగ్ సర్దార్‌గా పనిచేస్తున్న శాంతయ్యకు మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే శాంతయ్య కుటుంబసభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానాలు వినిపిస్తున్నాయి. గత 15 రోజుల క్రిందట శాంతయ్య కుటుంబసభ్యులు ఆయనను హత్య చేయడానికి ప్రయత్నించినట్లు, ఆ హత్యాప్రయత్నం నుండి ఆయన తప్పించుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలం నుండి నాలుగు పెట్రోల్ క్యాన్లు, కారం పొడిని పోలీసులు స్వాధీనం చేసుకొని అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసును చేదించేందుకు 16 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు, అదేవిధంగా ఫోరెన్సిక్, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులతో వివరాలు సేకరిస్తున్నట్లు మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు.
ఘటనపై పూర్తి నివేదిక వచ్చిన వెంటనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని ప్రభుత్వవిప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పరిశీలించి, మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆరుగురు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. విచారణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయాన్ని కుటుంబసభ్యులకు అందజేస్తామని తెలిపారు.