హెచ్3ఎన్2 వైరస్ సోకిన ఇన్‌ఫ్లూఎంజాతో ఆరుగురు మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. హర్యానా, కర్నాటక, పంజాబ్‌లో ఈ మరణాలు సంభవించాయి. కర్ణాటకలోని హసన్‌లో ఓ వృద్ధుడు దేశంలోనే హెచ్3ఎన్2తో మరణించిన మొదటి వ్యక్తిగా భావిస్తున్నారు. 82 ఏళ్ల హైరే గౌడ గత నెల 24న ఆస్పత్రిలో చేరగా మార్చి 1న మరణించినట్లు అధికారులు తెలిపారు. అతను మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నాడని సమాచారం. దేశంలో దాదాపు 90 హెచ్3ఎన్2 కేసులు నమోదైయాయి. 8 హెచ్1ఎన్1 వైరస్ కేసులు కూడా కనుగొన్నారు. గత కొన్ని నెలలుగా దేశంలో ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. హాంకాంగ్ ఫ్లూ అని కూడా పిలవబడే హెచ్3ఎన్2 వైరస్ వల్ల అనేక ఇన్ఫెక్షన్లు వస్తాయి. ప్రస్తుతం దేశంలో ఇప్పటివరకు హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 ఇన్ఫెక్షన్లు మాత్రమే బయటపడ్డాయి. దాదాపు 6.8 మిలియన్ మరణాలకు కారణమైన కొవిడ్ తరహా లక్షణాలు ఈ రెండు ఇన్ఫెక్షన్లలో కనిపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కుదిపేసిన మహమ్మారి రెండేళ్ల తర్వాత పెరుగుతున్న ఫ్లూ కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిరంతరం దగ్గు, జ్వరం, చలి, ఊపిరి ఆడకపోవడం, శ్వాస ఆడకపోవడం, శ్వాసలో గురక వంటి లక్షణాలు ఈ వైరస్ సోకినవారిలో కనిపిస్తాయి. కొంత మంది రోగులు వికారం, గొంతు నొప్పి, విరోచనాల వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని ఎయిమ్స్- ఢిల్లి మాజీ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. ఈ లక్షణాలు దాదాపు ఒక వారం రోజుల పాటు కొనసాగవచ్చు. వైరస్ అంటువ్యాధి అని, దగ్గు,తుమ్ములు, వ్యాధి సోకినవారితో సన్నిహితంగా ఉండటం ద్వారా వ్యాపిస్తుందని నిపుణులు అంటున్నారు. చేతులతో పాటు మాస్క్‌లను క్రమం తప్పకుండా శుభ్రపరుచుకోవడంతో పాటు కొవిడ్ లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు రుమాలుతో తమ ముక్కు, నోటిని కప్పుకోవాలని, తరచుగా నోటిని, ముక్కును తాకడం మానుకోవాలని, జ్వరం, ఒళ్ల నొప్పులకు పారసిటమోల్ ట్యాబ్లెట్లను తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సూచించింది. జ్వరం మూడు నాలుగు రోజులు ఉంటుందని, అయితే, దగ్గు, దాదాపు మూడు వారాలపాటు ఉంటుందని పేర్కొంది. దీర్ఘకాలిక వైద్య సమస్యల కారణంగా తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులతో పాటు పెద్దలు, చిన్న పిల్లలు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంది. ఇన్సెక్షన్ బాక్టీరియా కాదా అని నిర్ధారించే ముందు రోగులకు యాంటీబయాటిక్స్ సూచించవద్దని ఐసీఎంఆర్ వైద్యులను కోరింది. యాంటిబయాటిక్స్‌తో వైరస్ మరింత ప్రతిఘలనను అభివృద్ది చేసుకుంటుందని తెలిపింది.
మార్చి చివర్లో ఎన్‌ఫ్లూఎంజా తగ్గుముఖం పడుతోంది
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత కేంద్రాల్లో కాలానుగుణంగా ఇన్‌ఫ్లూఎంజా పరిస్థితిని రియల్ టైమ్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రొగ్రామ్(ఐడీఎస్‌పీ) నెట్‌వర్క్ ద్వారా నిశితంగా పరిశీలిస్తోంది. మార్చి చివరి నాటికి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కాలానుగుణంగా ఇన్‌ఫ్లూఎంజా హెచ్3ఎన్2 కారణంగా అనారోగ్యం, మరణాలపై కూడా నిశితంగా గమనిస్తున్నట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. సీజనల్ ఇన్‌ఫ్లూఎంజా నేపథ్యంలో చిన్న పిల్లలు, వృద్ధులు, వైరస్ సోకినవారితో సన్నిహితంగా ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.