ఏవోబీలో ఆరుగురు కీలక మావోయిస్టులు లొంగిపోయారని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. గురువారం అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం లోకల్ సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. గాదర్ల రవి తమకు సరెండయ్యారన్నారు. ఏవోబీలోని బేస్ ఏరియాలో మిలిషీయా కేడర్ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం నుండి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు. మావోయిస్టులు అనుసరించే పద్దతుల ద్వారా సమస్యలు పరిష్కారం కావని ఆదీవాసీలు అర్ధం చేసుకున్నారని డీజీపీ తెలిపారు. ఏజెన్సీలో భూ సమస్యలు తగ్గిపోయిందన్నారు. పట్టాలు ఇవ్వడం వల్ల ఈ సమస్య పరిష్కారం అయిందన్నారు.
గిరిజనుల నుండి మావోయిస్టులకు మద్దతు లభించడం లేదని డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలో 20 వేల మందికి ప్రభుత్వం భూమి పట్టాలను ఇచ్చిందని ఆయన చెప్పారు. గత నెలలో మావోయిస్టు కీలక నేత ఒకరు లొంగిపోయాడన్నారు. ఆయన కొంత సమాచారం ఇచ్చినట్టుగా చెప్పారు. ఈరోజు డివిజనల్ కమాండర్, ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు సహా మరో ముగ్గురు లొంగిపోయారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పోరాడదామని మావోయిస్టులు అంటున్నా గిరిజనులు ఆసక్తి చూపడంలేదన్నారు. గతంలో ఏవోబీలో 8 మావోయిస్టు కమిటీలు ఉండేవని.. ఇప్పుడు 4 కమిటీలు కూడా లేవన్నారు. అనేకమంది జనజీవన స్రవంతిలో కలిసిపోయారని పేర్కొన్నారు.
గతనెల స్పెషల్ జోన్ కమాండర్ సరెండర్ అయ్యారన్నారు. ప్రజాస్వామ్యంలో హింస, రక్తపాతం ద్వారా సాధించేది ఏదీ ఉండదన్నారు. రూరల్, ట్రైబల్ ఏరియాలకు ప్రభుత్వ కార్యక్రమాలు బాగా రీచ్ అవుతున్నాయని, వాలంటీర్ల వ్యవస్థ బాగా పని చేస్తుందన్నారు. నేరుగా లబ్దిదారులకు పథకాలు అందుతున్నాయన్నారు.
రాష్ట్రంలో నూతన పాలనా విప్లవం రావడంతో పోలీసు వ్యవస్థలోనూ అనేక మార్పులు వచ్చాయని డీజీపీ సవాంగ్ అభిప్రాయపడ్డారు. పోలీసుల భాష, ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నారు. పాడేరులో మెడికల్ కాలేజ్, బుట్టాయిగూడెం, రంపచోడవరంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని డీజీపీ అన్నారు. సీఎం జగన్ గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ట్రైబల్స్‌కు సీఎం జగన్ అనేక పదవులు ఇస్తున్నారని డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు.