మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో విషాదం నెలకొంది. ప్రైవేట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల ఆరుగురు మృతి చెందారు. నగరంలోని పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతతో రోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పలు ఆస్పత్రుల్లో రోగులను ఇండ్లకు తీసుకెళ్లండి లేదంటే మీ ఆక్సిజన్ సిలిండర్లను మీరే తెచ్చుకోండి అని వైద్యులు రోగుల బంధువులకు సూచిస్తుండటం గమనార్హం. అటు ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లను తీసుకోవడానికి జనం ఒక్కసారిగా పరుగెత్తుకు రావడంతో గుర్జర్ ఆస్పత్రిలో తొక్కిసలాట జరిగింది.
‘నగరంలోని పలు కొవిడ్ ఆసుపత్రులలో ఆక్సిజన్ సరఫరా లేకపోవడంపై ఫిర్యాదులు వచ్చాయి. ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా వారికి సిలిండర్లు సకాలంలో పంపుతున్నాం. ఆసుపత్రిలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎవరైనా చనిపోతే దానిని పరిశీలిస్తాం. రోజంతా 80 ఆస్పత్రులకు 46 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశాం’ అని భోపాల్ కలెక్టర్ అవినాష్ లవానియా వెల్లడించారు. అటు మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని వాసాయి పట్టణంలోనూ ఆక్సిజన్ కొరత కారణంగా 10 మంది చనిపోయిన ఘటన రెండు రాష్ట్రాల్లోనూ విషాదం నింపింది.