Wednesday, November 20, 2024

Delhi | తిహార్ జైల్లోనే సిసోడియా.. మే 12 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ మరోసారి పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో గురువారం సిసోడియాను సీబీఐ అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్సులోని స్పెషల్ కోర్టు జడ్జి ఎం.కే. నాగ్‌పాల్ ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, ఈ పరిస్థితుల్లో సిసోడియా కస్టడీ పొడిగించాలని సీబీఐ అధికారులు కోరారు. సీబీఐ వాదన పరిగణలోకి తీసుకున్న జడ్జి, మే 12 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ తిహార్ జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించారు.

- Advertisement -

ఫిబ్రవరి 26న మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయగా రెండ్రోజుల క్రితం ఆయనపై చార్జిషీటును కూడా దాఖలు చేసింది. ఈలోగా బెయిల్ కోసం సిసోడియా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇదే కేసులో సీబీఐ అరెస్టు చేసిన అందరికీ బెయిల్ లభించినప్పటికీ, సిసోడియాకు మాత్రం స్పెషల్ కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు మద్యం పాలసీ అక్రమాల్లో మనీలాండరింగ్ అంశాన్ని దర్యాప్తు చేస్తున్న ఈడీ కూడా సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ స్పెషల్ కోర్టులో పెండింగులో ఉంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement