సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రంలో సీఎం ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక దేవాలయాలకు పునర్ వైభవం తీసుకువస్తూ పూర్వ దేవాలయాలను పునర్ నిర్మాణం చేస్తూ ధార్మిక కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని జీర్నా వస్తకు చేరిన పురాతన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్నిమూడు కోట్ల నిధులు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయగా అట్టి నిధులతో ఆలయాన్ని పునర్నిర్మాణం నకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో కలిసి ఆలయ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, టిటిడి చైర్మెన్ వైవి సుబ్బారెడ్డిలకు గ్రామ ఆలయ కమిటీ సభ్యులు, సర్పంచ్ వెంకట్ రెడ్డీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యా ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అగ్రవర్ణాల నుండి అణగారిన వర్గాల వారందరూ సుఖంగా ఉండేలా సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు.
తెలంగాణ ప్రజలకు విద్యుత్, సాగునీటి కష్టాలు లేకుండా అనేక ప్రాజెక్టులతో గ్రామాలలోని చెరువులు, కుంటల్లో ఎర్రటి ఎండాకాలంలో కూడా నీరు ఉండేలా చేపట్టిన ప్రాజెక్టుల అభివృద్దితో తెలంగాణ అధిక పంటలతో అన్నపూర్ణగా వర్ధిల్లు తుందని కేటీఆర్ అన్నారు. ఆంధ్ర, తెలంగాణ విడిపోయి వేరువేరు రాష్ట్రాలుగా మారినా తెలుగు ప్రజలు మాత్రం అన్నదమ్ములుగా స్నేహంగానే ఉంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి, బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం అద్భుతంగా యాదాద్రి ఆలయాన్ని నిర్మించి చరిత్రలో గొప్ప నరసింహ క్షేత్రాన్ని ప్రజలకు, భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారన్నారు. అలాగే టీటీడీ దేవస్థానం చైర్మన్ గొప్ప మనసుతో కరీంనగర్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి, సిరిసిల్లలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్ నిర్మాణానికి, ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణానికి కోట్లాది రూపాయలు మంజూరు చేసి తెలంగాణా, ఆంధ్రా భక్తులు వేరు కారని, తెలంగాణ వేరు పడిన వెంకటేశ్వర స్వామి ఆలయ నిధులతో ఆలయాలు నిర్మాణాలకు నిధులు ఇవ్వడం ఆనందదాయకం అని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ధార్మికత, దార్శనికత, అభివృద్ధి ప్రధాతగా సీఎం రాష్ట్రంలో అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందుందని ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందించాలని కేటీఆర్ కోరారు.